వద్దనలేక.. కాదనలేక.. టీటీడీ బోర్డు చైర్మెన్ పదవి తీసుకున్న వైవీ

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ సీటులో మరోసారి ఏపీ సీఎం బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కూర్చున్నారు. కాదు.. కాదు.. కూర్చోబెట్టారు. గతంలో ఎంపీగా ఉన్న ఆయనను కాదని గత ఎన్నికల్లో మాగుంటకు అవకాశమిచ్చి టీటీడీ ఈయనకు కేటాయించారు జగన్. అయితే బోర్డు పదవీ కాలం ముగియడంతో.. ఏం చేయాలో అర్థం కాక వైవీని బుజ్జగించడానికి మరోసారి చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే.. టీటీడీ బాధ్యతలు తీసుకోవడం వైవీకి అస్సలు ఇష్టం లేదని తెలిసింది. తాను ఎంపీగా పార్టీ వ్యవహారాలు చూస్తూ ఢిల్లీలో ఉండాలని, ప్రజాసేవలో తరించాలని ఆయన కోరిక.

అయితే జగన్ వైవీకి అటువంటి అవకాశమివ్వలేదు. లోక్ సభ స్థానికి పోటీచేసేందుకు అవకాశమివ్వలేదు.. కనీసం రాజ్యసభకైనా పంపాలని పట్టుపట్టారట. దానికి కూడా వైసీపీ చీఫ్ సుముఖంగా లేరట. ఈసారి కూడా టీటీడీ బాధ్యతలు మీరే చూసుకోండి.. వచ్చేసారి చూద్దాం.. అంతలోపు ఎన్నికలు వస్తాయి.. అప్పటికి పరిస్థితులను బట్టి మీకు అవకాశం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో వైవీ వద్దనలేక..కాదనలేక టీటీడీ బాధ్యతలు చేపట్టారు.

ఇదిలా ఉండగా ముందునుంచీ పార్టీ తనను పక్కన పెడుతోందనే అభిప్రాయంలో ఉన్నారట వైవీ. గత ఎన్నికల్లో ఎంపీగా అవకాశం ఇవ్వలేదు.. ఇపుడు రాజ్యసభ స్థానం గురించి పట్టించుకోవడం లేదు.. ఇలా ఎంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలి.. అనేది ఆయన బాధ. గతంలో వైవీని కాదని మాగుంటకు టికెట్ కేటాయించడంతో కొద్ది రోజుల పాటు ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. తరువాత పార్టీ సీనియర్లు ఆయనను బుజ్జగించడంతో సమస్య సద్దుమణిగింది. మరో.. రెండేళ్ల తరువాత పరిస్థితులు ఎటు వైపు దారితీస్తాయో చూడాలి.