కారును ఢీ కొట్టాలా? వద్దా..?  తెలంగాణ బీజేపీ నేతల్లో అనుమానాలు..

రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చిన తరువాత బీజేపీ నాయకుల వాయిస్ పెరిగిపోయింది. ముఖ్యంగా టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్ దూసకుపోతున్నాడు. నేరుగా సీఎం మీదనే బండి సంజయ్ విమర్శలు ఎక్కుపెడుతున్నాడు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత చంచల్ గూడ జైలుకు పంపుతామని.. ప్రగతి భవన్ పని పడతామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్లి కాళేశ్వరం, మిషన్ భగీరథ లు డబ్బు కోసమే చేపట్టారని ప్రతిచోటా ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వీరు ఇక్కడ ఇలా పోరాడుతుంటే.. బీజేపీ పెద్దలు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ప్రకటనలిస్తున్నారు. వారు అలా.. మేము ఇలా మాట్లాడుతుంటే.. ఇంక కారుకు పోటీగా వెళ్లేందుకు ఎలా సాధ్యమవుతుందని పలువురు నాయకులు సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో ఎటువంటి అవినీతి చోటు చేసుకోలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా చెప్పింది. ఈ పరిస్థితుల్లో మేము అవినీతి గురించి మాట్లాడితే జనం ఎలా నమ్ముతారని నేతలు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఎంపీలు బండి సంజయ్,ధర్మపురి సంజయ్, బాపురావులు అవినీతి గురించి ఢిల్లీలో మాట్లాడటం.. పార్టీ మాత్రం నోరెత్తకపోవడం విచిత్రంగా ఉందని పార్గీ వర్గాలే ముక్కున వేలేసుకుంటున్నాయి. బీజేపీ అధిష్టానం కొంచెమైనా సహకరిస్తే కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ దూసుకుపోతాం.. ఇలా మా నోళ్లు కట్టేస్తే ఏం చేయగలం అని  అంటున్నారట.