కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్న కేటీఆర్ మాటలు..?

హుజూరాబాద్ ఎన్నికలా.. ఆ విషయం గురించి పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడనేలేదు.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత దాని గురించి మాట్లాడవచ్చు అని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చెప్పడం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ అధినేత హుజూరాబాద్ విషయంపై సూచనలు, సలహాలు చేసి ఉంటారని అందరూ భావించారు. అయితే అలాంటిదేం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

కొద్ది రోజుల క్రితం హుజూరాబాద్ ఎన్నికలు నేడో, రేపు జరుగుతున్నట్లు అన్ని పార్టీల నాయకులు ప్రవర్తించారు. కేసీఆర్ కూడా ఒక అడుగు ముందుకేసి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధును ప్రారంభించారు. పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ప్రచారం కూడా నిర్వహించారు. ఆయనతోపాటు కొందరు మంత్రులు కూడా హుజూరాబాద్ చుట్టివచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా హుజూరాబాద్ పైనే కాన్సంట్రేట్ చేశాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్.. గెలిచి తీరాల్సిందే అనే లక్ష్యంతో యాత్ర చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో నెంబర్ 2 ఇలా ప్రకటించడం నిజంగా ఆశ్చర్యకరం. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇంత చేసినా అక్కడి పరిస్థితులు కారుకు ఆశాజనకంగా లేవనే సమాచారం వచ్చినట్లు తెలిసింది. అందుకే అక్కడ పార్టీ ఓడిపోయినా ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు అని కేటీఆర్ అనడం రాజకీయ పరిశీలకులను మరింత ఆలోచింపచేస్తుంది. ఏది ఏమైనా కేటీఆర్ కామెంట్స్ తో కారు పార్టీ కాస్త నైరాశ్యం ఉన్నట్లుందని తెలుస్తోంది.