బీఎస్పీ కండువా కప్పుకోనున్న మాజీ ఐపీఎస్

తెలంగాణలో గురుకులాల బాధ్యతలను వదలుకొని స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన  మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ పార్టీలో చేరిపోయేది తెలిసిపోయింది. ఆగస్టు 8వ తేదీన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరనున్నారు.  ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకున్న కొద్ది రోజులలోనే ఆర్ఎస్పీ  ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యపరచింది. గతంలో సీబీఏ జేడీగా పనిచేసిన లక్ష్మినారాయణ, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణలు కూడా ఇంత త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అనేక రోజుల పాటు ఆలోచించి వారు నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఆర్ఎస్పీ మాత్రం వారికి భిన్నంగా రాజకీయ అడుగులు వేయడం.. అదీ స్పీడుగా వేయడం ప్రారంభించారు. అందరూ .. టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు అనే ఊహించారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కాన్షీరామ్ స్థాపించిన బీఎస్పీ వైపే మొగ్గు చూపారు.  వచ్చే నెలలో నల్గొండలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో ఆ పార్టీ నేత రామ్ జీ గౌతం ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు. నిరాడంబరంగా జరిగే ఈ కార్యక్రమానికి ఆయన శిష్యులు, అభిమానులు, స్వేరోస్ సభ్యులు, బీఎస్పీ నాయకులు హాజరవుతారు. బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన పలుచోట్ల పర్యటించి అభిమానుల అభిప్రాయాలు తీసుకున్నారు. మధ్యలో రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. నన్ను అనవసరంగా వివాదాల్లోకి లాగకండి అనే హెచ్చరికలు కూడా చేశారు. ఎందుకో మరి.. కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే ఈ మాజీ అధికారి ఇపుడు కేసీఆర్ నే విమర్శిస్తున్నారు. అయితే.. ఇన్నీ రాజకీయాలు కదా.. ఎప్పుడేం జరుగుతుందో.. చూడాలి.