తెలంగాణ పాలిటిక్స్.. బిఫోర్ రేవంత్.. ఆఫ్టర్ రేవంత్

– రేవంత్ రాగం పాడుతున్న ఇతర పార్టీలు.. ఉత్సాహంలో కాంగ్రెస్ ..మేల్కొన్న కేసీఆర్..బేజారవుతున్న బీజేపీ..టీడీపీ మామూలే.

రేవంత్ రెడ్డి.. ఓ ఫైర్ బ్రాండ్.. అతని మాటే ఓ సంచలనం.. అతని దుందుడుకు స్వభావమే అతని బలం.. ఏ పార్టీలో ఉన్నా సరే.. అది అధికార పార్టీ అయినా.. ప్రతిపక్ష పార్టీ అయినా.. ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా రేవంత్ ఈజ్ రేవంత్ అని విశ్లేషకులు చెప్పే మాటలు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. సమీకరణలు మారుతున్నాయి. వివిధ పార్టీలు తమ బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత టి. రాజకీయాలు బిఫోర్ రేవంత్.. ఆఫ్టర్ రేవంత్ అని చెప్పవచ్చు.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం.

కాంగ్రెస్ పార్టీ: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. అధికార పార్టీకి గట్టిగా కౌంటర్ ఇచ్చే నాయకుడే కరువై పోయాడు. అతిపెద్ద జాతీయ పార్టీకి రాష్ట్రంలో వాయిస్ లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో అయినా.. ఇప్పుడైనా వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఫేస్ వాల్యూ ఉన్న నాయకుడు కరువయ్యాడు. వృద్ధ తరం జిల్లాలకే పరిమితమైంది.వాళ్ల మాటలు వినే పరిస్థితి ఎవరికీ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నా ఆయన పార్టీలో పెద్ద ప్రభావం చూపలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో రేవంత్ మూడున్నరేళ్ల క్రితం టీడీపీ నుంచి కాంగ్రెస్ వైపు వచ్చాడు. రాహుల్ గాంధీ ప్రోత్సాహంతో పార్టీలో దూసుకుపోతున్నాడు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఎంపీగా చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతనికి అధిష్టానం పీసీసీ పగ్గాలు అప్పగించింది. పార్టీలో పలువురు నాయకులు వద్దంటున్నా అధిష్టానం రేవంత్ వైపే మొగ్గు చూపింది.

గాంధీ భవన్ వైపు కెమెరాలు..
పొలిటికల్ సర్కిల్, మీడియా, సోషల్ మీడియాలో టీ. పాలిటిక్స్ అంటే కేవలం తెలంగాణ భవన్, టిఆర్ఎస్ నాయకులు కనిపించేవారు. ఇది రేవంత్ టీపీసీసీ చీఫ్ కాకముందు. తరువాత సిట్యుయేషన్స్, ఈక్వేషన్స్ పోయాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిపోయింది. రేవంత్ మాటలు నేరుగా కెసిఆర్ ను టార్గెట్ చేశాయి. దీంతో మీడియా కెమెరాలన్నీ గాంధీ భవన్ వైపు చూడటం ప్రారంభించాయి. కేసీఆర్ తో డీ అంటే డీ అంటుండటంతో రాజకీయం వేడెక్కింది
ఓ సందర్భంలో “నేను టిడిపి నుంచి వస్తే.. మరి ఆయన ఎక్కడ నుంచి వచ్చారు? టీడీపీ నుంచే కదా” అని కౌంటర్ ఇవ్వడం.. టిఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆలోచిస్తే అరే.. ఇది నిజమే కదా అని అనుకుంటున్నారు.

 

వ్యతిరేకించినవారు సైలెంట్ అయ్యారు..

రేవంత్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే తాము ఒప్పుకోమని.. అతనికి ఇవ్వద్దని చెప్పిన నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అధిష్టానానికి బధ్ధుడుగా ఉంటానని చెబుతూ అసంతృప్త నాయకులతోపాటు పార్టీకి దూరంగా ఉంటున్న వారిని కలిసి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు సంజీవరెడ్డి మద్దతు కోరారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన దేవేందర్ గౌడ్ ను కలిసి ‘కలిసి పని చేద్దాం’ అని కూడా కోరారు. అంతేకాక బిజెపి, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వారిని కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ రేవంత్ కు కలిసొచ్చే అంశాలు. రాజ్ భవన్ ముట్టడి, కోకాపేట భూముల వ్యవహారం, హౌస్ అరెస్ట్ లాంటి విషయాలు గమనిస్తే..అరె కాంగ్రెస్ పార్టీ పర్లేదే అని జనం అనుకుంటున్నారూ. ఈ విషయాలన్నీ గమనిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాస్త బలం పుంజుకుంటున్నట్టే కనిపిస్తుంది.

 

టీఆర్ఎస్: రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మేల్కొన్నట్టే కనిపిస్తుంది. పార్టీ బలం తగ్గకుండా.. ఇమేజ్ పోకుండా.. గులాబీ అధినేత స్కెచ్ వేస్తున్నారు. ఇతర పార్టీలలో బలమైన నాయకులను పార్టీలోకి తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఎల్. రమణ ఎపిసోడ్ ఇందుకు నిదర్శనం. ఇక ఇతర పార్టీల బలాబలాలు తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ ఉండనే ఉంది. తెలంగాణ ఏర్పడ్డతరువాత కెసిఆర్ నెంబర్ వన్ అనుకుంటే .. తరువాత పేరు రేవంత్ రెడ్డి అని వినిపిస్తుంది. ఇది టిఆర్ఎస్ పార్టీకి కాస్త ఇబ్బందే అని చెప్పవచ్చు.

బీజీపీలో అయోమయం : కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యతలు రేవంత్ స్వీకరించక ముందు తెలంగాణలో సెకండ్ లీడింగ్ పార్టీ ఏది అంటే బిజెపి అని చెప్పుకునేవారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేసీఆర్ ను దాదాపు ఢీ కొట్టాడు. దుబ్బాక ఎన్నికల్లో పార్టీ విజయం, జిహెచ్ఎంసి లో అధిక కార్పొరేటర్ స్థానాలు సాధించడంలో బండి చేసిన కృషి ఆమోఘమమే చెప్పవచ్చు. టిఆర్ఎస్ పార్టీకి దీటుగా ఎదుగుతున్న బిజెపి.. రేవంత్ వచ్చిన తర్వాత కాస్త తగ్గినట్లు అనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకుముందు బండి సంజయ్ కెసిఆర్ ను ఏం తిడతారో అని ఆలోచించే మీడియా ఇప్పుడు రేవంత్ పైపు చూస్తోంది. దీంతో కమలం శ్రేణులు కాస్త డల్ అయినట్లు కనిపిస్తున్నాయి. బీజేపీలో బండి సంజయ్ కు ఇతర నాయకులు సహకరించకపోవడం..లాంటివి పార్టీకి నష్టమే అని చెప్పవచ్చు.

అసలు ఉందో లేదో తెలియని తెలుగుదేశం పార్టీ: తెలంగాణలో టీడీపి పరిస్థితి ప్రజలకే కాదు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా అర్థం కావటం లేదు. అంతెందుకు చంద్రబాబు నాయుడుకు కూడా…! తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ ఏదో ఒక జెండా కింద చేరిపోయారు (రేవంత్ తో సహా).. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ కూడా ఎన్టీఆర్ భవన్ వీడి తెలంగాణ భవన్ లో స్థానం సంపాదించుకున్నాడు. నాయకులు లేక.. ఎవరూ పట్టించుకోక రెంటికీ చెడ్డ నావలా తయారయింది టిడిపి పరిస్థితి. రాష్ట్రంలో పార్టీ ” ఉందా ..అంటే.. ఉంది..అంతే..!” అనే పరిస్థితి తెలుగుదేశం పార్టీది.