కరోనా కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. అనేక సినిమాలు వాయిదా పడ్డాయి. షూటింగులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడటం వలన షూటింగులు జరుగుతున్నాయి. త్వరలో థియేటర్లు తెరుచుకోనున్నాయి. తాజాగా భారతదేశ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం గురించి ప్రకటన వెలువడింది. ఐఎఫ్ఎఫ్ఐ 52వ ఎడిషన్ గోవాలో నిర్వహించనున్నారు. నవంబర్ 20 నుంచి 28వ తేది వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను సమాచార,ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ విడుదల చేయడం విశేషం.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ ఉత్సవం ప్రతి ఏడాదిలాగే కొన్ని ఉత్తమమైన సినిమా రచనలను గుర్తిస్తుంది. అలాగే భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉత్తమ చిత్రాలను ప్రదర్శించి వేడుకలను నిర్వహిస్తుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 52వ ఎడిషన్ పోటీ విభాగంలో పాల్గొనడానికి ఎంట్రీలను ఆగస్టు 31వ తేది వరకూ సమర్పించవచ్చని ప్రకటన విడుదల చేసింది.