తెలంగాణలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..!

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తుండగా వారి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులను సర్కారు మంజూరు చేయానున్నది. అర్హులైన పేదలకు రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర సీఎం కేసీఆర్ సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం జరుగనుంది. కొత్త రేషన్‌ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్‌ బియ్యం అందజేయనున్నారు.

అర్హులైన మొత్తం 3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు పౌర సరఫరాల శాఖ సమాచారం అందించింది. అయితే, జూన్ నెలలోనే న్యూ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయాలని సీఎం నిర్ణయించినప్పటికీ దరఖాస్తుల పరిశీలనకు ఇంత సమయం పట్టిందని తెలుస్తోంది. అప్లికేషన్ చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య 4,46,169గా ఉండగా, వీటిని అన్ని దశల్లో పరిశీలన చేశారు. డూప్లికేట్‌లు లేకుండా, ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు పరిశీలించారు ఆఫీసర్లు. వారు వివిధ అంశాల్లో పరిశీలించిన తర్వాత 3,09,083 మందిని అర్హులుగా గుర్తించారు.