అక్టోబర్‌ 17 నుంచి పొట్టి ప్రపంచ కప్‌..?

భారత్ లో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్‌ కరోనా రక్కసి దెబ్బకు యూఏఈకి తరలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక లేదా యునైటెడ్ అరబ్ లో ఈ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేయగా… యూఏఈ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. అక్టోబర్‌ 17 నుంచి యూఏఈలో ఈ టోర్నీ జరుగుతుంది. నవంబర్ 14న ఫైనల్ నిర్వహిస్తారు.

మూడు వేదికల్లో ఈ టోర్నీ నిర్వహిస్తారని తెలుస్తోంది. అబుదాబి, షార్జా, దుబాయ్ లో టీ20 పోటీలు జరుగుతాయట. క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లకు ఒమన్ ఆతిథ్యం ఇస్తుందని వినికిడి. ఎటు చేసి ఇండియాలోనే పొట్టి ప్రపంచ కప్‌ నిర్వహించాలనుకున్న బోర్డుకు ప్రస్తుత పరిస్థితుల్లో వీలు కాలేదని సమాచారం. భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు విషయంలో ఎలాంటి హామీ లభించకపోగా.. కరోనా ప్రభావం కూడా ఇండియాలో తగ్గకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకుందట. కాగా.. టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తరలిస్తే… ఈ ట్రోఫీ వల్ల బోర్డుకు వచ్చే ఆదాయంలో 41 శాతం ఆదా అవుతుందని తెలిపిందట. ఇది కూడా ట్రోఫీ తరలిపోవడానికి ఓ కారణం అయి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.