ట్విట్ట‌ర్‌కు నోటీసులు జారీ..!

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల విషయంలో ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను ట్విట్టర్ పాటించడం లేదని, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా సైట్ లో కనిపించడం లేదంటూ అమిత్ ఆచార్య అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

మే 25వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన కొత్త నియమాలను ట్విట్టర్ పట్టించుకోవడం లేదని అమిత్ ఆచార్య తన పిటిషన్ లో పేర్కొన్నారు. అమెరికాకు చెందిన వ్యక్తిని ట్విట్టర్ గ్రీవెన్స్ ఆఫీసర్ గా నియమించిందని, కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021లోని నాల్గవ నిబంధనకు అది విరుద్ధమని న్యాయవాది అమిత్ ఆచార్య ఆరోపించారు. మే 28వ తేదీ రోజునే తాము గ్రీవెన్స్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందని ట్విట్టర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయస్థానం ట్విట్టర్ కు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.