ఎంపీ రఘురామకృష్ణకు సుప్రీంకోర్టు బెయిల్‌..!?

నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు ముగ్గురు వైద్యుల నివేదిక పేర్కొంది. వైద్య పరీక్షల నివేదికపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్.. ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదిక అందినట్టు తెలిపారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్-రే, వీడియో పంపారని అన్నారు. జనరల్ ఎడిమాతోపాటు గాయాలున్నట్టు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్ శరన్ వివరించారు. రఘురామ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ, ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు.

కస్టడీలో ఎంపీని చిత్రహింసలకు గురిచేసిన విషయం నిజమేనని తేలిందని ముకుల్ రోహిత్గీ వ్యాఖ్యానించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. సిట్టింగ్ ఎంపీకే ఇలా జరిగితే సాధారణ ప్రజల పరిస్థితేంటని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే.. ఆయన స్వయంగా చేసుకున్నావా? కాదా అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ధర్మాసనం, ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు ఎంపీ స్వయంగా గాయాలు చేసుకుంటున్నారా? అని ప్రశ్నించింది. సీనియర్ అడ్వైజర్, కార్డియాలజిస్ట్ కల్నల్ సంజీవ్ సేన్ గుప్తా నేతృత్వంలోని బృందం ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలను నిర్వహించింది. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్‌ను మంజూరు చేసింది.