అప్పుక‌ట్టాలంటే కోర్టుకెక్కాడు.. 10వేల జ‌రిమానా క‌ట్టాడు..

May 7, 2021 at 8:03 pm

ఇప్ప‌టికే కోర్టుల్లో ల‌క్ష‌లాది సంఖ్య‌లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏళ్ల త‌ర‌బ‌డి కక్షిదారులు కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. ఆ కేసుల‌ను ప‌రిష్క‌రించేందుకు న్యాయ‌మూర్తులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అనేక మార్గాల ద్వారా వాటిని ప‌రిష్క‌రించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. మ‌రోవైపు మ‌రికొంద‌రు మాత్రం కోర్టు స‌మ‌యాన్ని వృథా చేస్తున్నారు. అన‌వ‌స‌ర‌మైన వ్యాజ్యాలు దాఖ‌లు చేస్తూ కోర్టుకు కొత్త చిక్కులు పెడుతున్నారు. ఇలాగే నిరర్ధక వ్యాజ్యం వేసి కోర్టు సమయాన్ని వృధా చేసిన పిటిషనర్‌కు హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని రుణం ఇచ్చిన సికింద్రాబాద్‌ మర్కంటైల్‌ కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌కు కోర్టు ఖర్చుల కింద జమ చేయాలని ఆదేశించింది. ఇరుపక్షాలు డివిజనల్‌ కో–ఆపరేటివ్‌ అధికారి నేతృత్వంలోని కో–ఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌లో హాజరుకావాలని, మే 6 నుంచి గత ఆరు నెలల్లో జారీ చేసిన ఉత్తర్వులన్నింటినీ ట్రైబ్యునల్‌ తిరిగి సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేయాల‌ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల స్ప‌ష్టం చేసింది.

వివ‌రాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్‌కు చెందిన మందాడ విష్ణుదాస్‌ వ్యాపారం కోసం 2005లో పాతబస్తీలోని ఇంటి పత్రాలను తనఖా పెట్టి మర్కంటైల్‌ కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌నుంచి రూ.7 లక్షలు రుణం పొందారు. అప్పు తీర్చకపోవడంతో ఇంటిని బ్యాంక్‌ వేలానికి పెట్టింది. అయితే ఆ ఇంటిని నిర్ణీత గడువులోగా ఖాళీ చేయించలేకపోవడంతో వేలం రద్దు అయ్యింది. ఈ పరిస్థితుల్లోనే మందాడ విష్ణుదాస్‌ మరణించడంతో ఆ ఇంటిని ఆయన ఇద్దరు కుమారులు పంచుకున్నారు. తండ్రి చేసిన అప్పును తీర్చాలని ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులను కుమారుడు సురేష్‌కుమార్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. తిరిగి విచారించి ఉత్తర్వులు ఇవ్వాలన్న హైకోర్టు ఉత్తర్వులను డివిజన్‌బెంచ్‌ ఎదుట అప్పీల్‌ చేశారు. నిరర్ధక రిట్‌ వేసి కోర్టు సమయాన్ని వృధా చేశారని పిటిషనర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ధర్మాసనం.. రూ.10 వేలు జరిమానా విధించింది. ఈ మొత్తం చెల్లించాక ట్రైబ్యునల్‌ ఈ కేసును ఆరు నెలల్లోగా పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

అప్పుక‌ట్టాలంటే కోర్టుకెక్కాడు.. 10వేల జ‌రిమానా క‌ట్టాడు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts