ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ లీకై 22 మంది రోగులు మృతి..!

ఒక‌వైపు దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వేలాది మంది ప్రాణాల‌ను బ‌లిగొంటున్న‌ది. అదేవిధంగా తీవ్ర ఆక్సిజ‌న్ కొర‌త నెల‌కొన్న నేప‌థ్యంలోనూ ప‌లువురు మృత్యువాత ప‌డుతున్నారు. ఇప్ప‌టిక ఆక్సిజ‌న్‌ను పొదుపుగా వాడాల‌ని ప్ర‌భుత్వం, అధికారులు వైద్య‌శాల‌లు, సిబ్బందికి సూచిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆ దిశ‌గా వైద్య‌సిబ్బంది దృష్టి సారించిన‌ట్లు క‌న‌బ‌డ‌డం లేదు. మహారాష్ట్ర నాసిక్ లోని ప్రముఖ జాకీర్ హుస్సేన్ వైద్య‌శాల‌లో ఆక్సిజ‌న్ ట్యాంక్ లీకై ఏకంగా 22 మంది రోగులు మృత్యువాత ప‌డ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న‌ది. చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. వైద్య‌శాల వెలుపల ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒక ట్యాంక్ నుంచి భారీగా ఆక్సిజన్ లీక్ అయింది. దీంతో క్ష‌ణాల్లోనే ఆ ప్రాంత‌మంతా తెల్ల‌ని గ్యాస్ వ్యాఫించింది. ఈ ప‌రిస్థితుల్లో ఊపిరాడ‌క సుమారు 22 మంది రోగులు మృత్య‌వాత ప‌డ్డారు. క్ష‌ణాల్లోనే వైద్య‌శాల ప్రాంగ‌ణ‌మంతా భీతావహం వాతావరణం నెలకొంది. ఈ దుర్ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటీన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. స‌హాయ‌క‌, నివారణ చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికాసేపట్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇలాఉండగా, దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడిన నేప‌థ్యంలో రోగులకు ప్రాణాధారమైన ఆక్సిజన్ తగినంతగా లభ్యమేయ్యేలా చూసేందుకు పరిశ్రమలు తమ ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకోవాలని ప్ర‌ధాని మోడీ ఇచ్చిన పిలుపున‌కు టాటా గ్రూప్ సానుకూలంగా స్పందించింది. లిక్విడ్ ఆక్సిజన్ ని ట్రాన్స్ పోర్ట్ చేసేందుకు 24 క్రయోజెనిక్ కంటెయినర్లను దిగుమతి చేసుకుంటామంటూ ట్విటర్ ముఖంగా ఆ సంస్థ ప్రకటించింది. టాటా గ్రూప్ చ‌ర్య‌ల‌కు కృతజ్ఞతలని మోదీ ట్వీట్ చేశారు. గతేడాది కూడా కరోనా నివారణా చర్యలకు టాటా గ్రూప్ రూ. 1500 కోట్లను కేటాయించిం ఈ సందర్భంగా మోడీ కొనియాడారు.