అమెరికాలో భార‌త దంప‌తుల హ‌త్య‌..? భార్య ఏడునెలల గ‌ర్భిణి..

ఉన్న‌త చ‌దువు చ‌దివాడు. ఎన్నో క‌ల‌ల‌తో అమెరికా చేరుకున్నాడు. అక్క‌డే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నాడు. భార్య, నాలుగేళ్ల‌ పాప‌తో జీవితం సాఫిగా సాగిపోతున్న‌ది. ఏమైందో ఏమో కానీ ఆ దంప‌తులు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. ప్ర‌స్తుతం భార్య ఏడునెల‌ల గ‌ర్భిణి కావ‌డం విషాద‌క‌రం. ఈ సంఘ‌ట‌న అమెరికాలోని న్యూజెర్సీలో వెలుగుచూసింది. అక్క‌డి అధికారులు వెల్ల‌డించిన క‌థ‌నం ప్ర‌కారం.. మహారాష్ట్రాలోని బీద్ జిల్లాకు చెందిన రుద్రావర్(32), భార్య ఆర్తి బాలాజీ(30) దంపతులు 2015, ఆగస్టులో అమెరికా వలస వెళ్లారు. బాలాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌గా అక్క‌డే పనిచేస్తుండ‌గా, న్యూజెర్సీలోని నార్త్ ఆర్లింగ్టన్‌లో నివాసముంటున్నారు. వారికి నాలుగేళ్ల పాట ఉండ‌గా, ప్ర‌స్తుతం ఆర్తి ఏడు నెలల గర్భిణీ.

- Advertisement -

ఇదిలా ఉండ‌గా ఏమైందో ఏమో కానీ.. ఆ దంపతులు త‌మ నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధ‌వారం ఉద‌యం ఆ దంప‌తుల నాలుగేళ్ల కూతురు ఏడుస్తూ ఇంటి బాల్కనీలోకి రావడంతో గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు బాలాజీ ఇంటి తలుపు తీసేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి గడియా పెట్టి ఉంది. ఇక చేసేదేమీ లేక ఇంటి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా దంపతులు రక్తపుమడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. వారి ఇద్దరి శరీరాలపై బలమైన కత్తిపోట్లు ఉండడం గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ ఇది హత్య? లేదా ఆత్మహత్య? అనే విషయంపై స్పష్టత రాదని పోలీసులు ఈ సంద‌ర్భంగా వెల్లడించారు. బాలాజీ, ఆర్తి మృతితో వారి స్వస్థలంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి మృతదేహాలు స్వదేశానికి రావడానికి 8 నుంచి 10 రోజుల వరకు పడుతుందని సమాచారం. ప్రస్తుతం చిన్నారి న్యూజెర్సీలోని వారి స్నేహితుల వద్ద ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Share post:

Popular