మ‌ర‌దితో త‌ల్లి ఎస్కేప్‌.. ప‌దేళ్ల త‌రువాత ప‌గ‌తీర్చుకున్న కొడుకు

అక్ర‌మ సంబంధాలు అనేక దారుణాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఉసిగొల్పుతున్నాయి. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. వావివ‌రుస‌లు మ‌ర‌చి భ‌ర్త సోద‌రుడితో వివాహేత‌రం సంబంధం పెట్టుకుంది ఓ మ‌హిళ‌. అలా ప‌దేళ్ల క్రితం పంజాబ్ నుంచి హైద‌రాబాద్‌కు ఇద్ద‌రూ ప‌రార‌యి వ‌చ్చారు. అన్ని మ‌ర‌చిపోయి హాయిగా జీవిస్తున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఊహించ‌ని సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌దేళ్ల త‌రువాత ఆ మ‌హిళ కుమారుడు తిరిగివ‌చ్చి ప‌గ తీర్చుకున్నాడు. త‌ల్లితో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న త‌న బాబాయిని అంత‌మొందించాడు. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్‌లో వెలుగుచూసింది. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సద్‌నామ్‌సింగ్‌కి అప్ప‌టికీ పెళ్లి కాలేదు. తన సొంత అన్న భార్య బల్జీత్ కౌర్ తో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం బయటపడడంతో తన రెండేళ్ల‌ కొడుకు నిషాంత్ సింగ్ ను భర్త వద్దే వదిలేసి మ‌ర‌దితో క‌లిసి బ‌ల్జీత్‌కౌర్ ఇల్లు విడిచిపోయింది. హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చారు. వారిద్ద‌రికి ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇక్క‌డే ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్‌ను నిర్వ‌హిస్తూ అన్ని మ‌ర‌చిపోయి హాయిగా జీవ‌నం సాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. త‌ల్లి త‌న‌ను వ‌దిలిపోవ‌డం, తండ్రికి గ్రామంలో అవ‌మానాలు ఎదుర‌వ‌డం చూసిన నిషాంత్ చిన్న‌త‌నం నుంచే ఆవేద‌నకు గుర‌య్యాడు. దీనంత‌టికి కార‌ణ‌మైన బాబాయిపై ప‌గ పెంచుకున్నాడు. ప్ర‌తీకారేచ్చ‌తో ర‌గిలిపోయాడు. వ‌య‌స్సుతో పాటు వారిపై అత‌ని ద్వేషం సైతం రెట్టింప‌యింది. అయితే త‌ల్లి, బాబాయి ఎక్కడకు వెళ్లారో? ఏమయ్యారో ఎంత వెతికినా ప‌దేళ్ల వ‌ర‌కు ఆచూకీ తెలియరాలేదు. తుద‌కు వారిద్ద‌రూ హైదరాబాద్ లో ఉంటున్నార‌ని తెలిసి పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. ముందుగా హైదరాబాద్ కు చేరుకున్నాడు. వాళ్లతో పరిచయం పెంచుకున్నాడు. వాళ్ల వ్యవహారం అంతా మర్చిపోయినట్టు నాటకమాడాడు. త‌న‌కు ఇక్క‌డే ప‌ని చేసుకుంటాన‌ని న‌మ్మ‌బ‌లికాడు. అలా రెండు మూడు సార్లు వచ్చి వెళ్ల‌డంతో వాళ్లు కూడా న‌మ్మారు. త‌మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే పనికి పెట్టుకున్నాడు సద్‌నామ్‌సింగ్.

అయితే తన కొడుకు నిషాంత్ అక్కడే పని చేయడం బ‌ల్జీత్‌కౌర్‌కు నచ్చలేదు. దీంతో సద్‌నామ్‌సింగ్‌తో గొడవ పడి తన ఏడేళ్ల కొడుకును తీసుకుని గురుద్వారాకు వెళ్లిపోయింది. సద్‌నామ్‌సింగ్‌ ఒక్కడే ఉండిపోవ‌డంతో ఇదే అద‌నుగా భావించిన నిషాంత్ తన బంధువులకు ఫోన్ చేసి పంజాబ్ నుంచి ర‌ప్పించాడు. వారి సాయంతో సద్‌నామ్‌సింగ్‌ను హత్య చేసి శవాన్ని మాయం చేసి హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాడు. ఏప్రిల్ 1న‌ ఈ హత్య విషయం బయటపడడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బల్జీత్ కౌర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే కొడుకు నిషాంత్ వ్యవహారం బయటకొచ్చింది. అతడే చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. వాళ్లు కూడా పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.