ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌త‌కు ఈసీ షాక్‌..!

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. 8 విడ‌త‌లుగా సాగ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఇప్ప‌టికే మూడు విడ‌త‌లు పోలింగ్ పూర్త‌యింది. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని రాజ‌కీయ పార్టీలు ప‌ర‌స్ప‌రం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యంగా ప‌శ్చిమ‌బెంగాల్ లో నైతే బీజేపీ శ్రేణుల‌కు, తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌ల‌కు మ‌ద్య యుద్ధ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంది. పీఎం మోడీపై ఆ రాష్ట్ర సీఎం మమ‌త తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. బీజేపీ అగ్ర నేత‌లు సైతం మ‌మ‌త విమ‌ర్శ‌ల‌ను ధాటిగానే తిప్పి కొడుతున్నారు.

ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కేంద్ర బలగాలపై ఈ నెల 7న, మార్చి 28న కేంద్ర బలగాలపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మరోసారి నోటీసులు జారీ చేయ‌డం రాజ‌కీయ దుమారం రేపుతున్న‌ది. శనివారం ఉదయం 11 గంటల్లోగా నోటీసుల‌పై స్పందించాలని ఈసీ అల్టీమేటం జారీచేయ‌డం గ‌మ‌నార్హం. కేంద్ర పారామిలిటరీ బలగాలపై మమత పూర్తిగా తప్పుడు, రెచ్చగొట్టే రీతిలో, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని త‌మ ప్రాథమిక విచారణలో తేలింద‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. ఇక ఇదిలా ఉండ‌గా.. మత ప్రాతిపదికన ఓట్లు అడిగారనే ఆరోపణలపై మమతకు ఎన్నికల సంఘం గతంలోనూ నోటీసులు జారీచేసింది. అయితే ఓట‌ర్లను మతాల పేరుతో విడ‌గొట్టే ప్రయ‌త్నా‌లకు వ్యతి‌రే‌కంగా గళ‌మె‌త్తు‌తూనే ఉంటా‌నని, ఆ విష‌యంలో ఎన్ని నోటీ‌సులు జారీ చేసినా తన వైఖరి మార‌దని మ‌మ‌త స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.