ఒడిశా సీఎంకు జ‌గ‌న్ లేఖ‌.. కీల‌క ప్ర‌తిపాద‌న‌

న‌వ‌ర‌త్నాల పేరుతో సంక్షేమ ప‌థ‌కాల‌తో దూసుకుపోతున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభివృద్ధి పైనా దృష్టి సారించారు. అంద‌రి మ‌న్న‌న‌ల‌ను అందుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల‌ను కూడా ప‌రుగులు పెట్టిస్తున్నారు. గ‌తంలో చేప‌ట్టిన ప్రాజెక్టుల‌నే కాకుండా నూత‌న ప్రాజెక్టుల‌కు శ్రీ‌కారం చుట్టేందుకు చ‌క‌చ‌కా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. కీల‌క ప్ర‌తిపాద‌న చేశారు.

ఒడిశా, ఏపీ ప‌క్క‌ప‌క్క రాష్ట్రాలు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. వంశ‌ధార న‌ది బేసిన ఇరు రాష్ట్రాల్లోనూ విస్త‌రించింది. ఈ నేప‌థ్యంలోనే వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఈ లేఖ రాశారు. బ్యారేజీ నిర్మాణంతో సముద్రంలోకి వృథాగా పోయే 80 టీఎమ్‌సీల నీటిని ఒడిసిప‌ట్టి వినియోగంలోకి తీసుకురావచ్చన్నారు. ఆ విషయంలో ఒడిశాతో సంప్రదింపులకు తాము సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. దానికి సంబంధించి చర్చించేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ సహాయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణంతో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రైతులకే గాకుండా, ఒడిశాలోని గణపతి జిల్లా రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని వెల్ల‌డించారు.