పవన్ కల్యాణ్.. కాపు సామాజిక వర్గంలో బలమైన సామాజిక నేతగా ఎదుగుతున్న నాయకుడు! 2014లో టీడీపీ-బీజేపీకి మద్దతునిచ్చి.. వారి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే హోదా విషయంలో ఆ పార్టీలు చేసిన మోసాన్ని సహించలేక.. వారికి ఎదురుతిరిగాడు! దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాడు! ఇప్పుడు పవన్ ఇచ్చిన ఆఫర్‌ను వైసీపీ లైట్ తీసుకుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అలాగే పవన్‌ను పక్కన పెట్టడం వెనుక అధినేత జగన్ వ్యూహం ఏమిటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న!!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీలతో కలిసి పనిచేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించి సంచలనం సృష్టించారు. వైసీపీతోనూ కలిసి నడిచేందుకు సిద్ధమని నర్మగర్భంగా చెప్పారు. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారినట్టేనని అంతా భావించారు. కానీ జనసేన అధినేత ప్రకటించిన ఈ ఓపెన్ ఆఫర్‌ను వైసీపీ లైట్ తీసుకుందని తెలుస్తోంది..వైసీపీ కి దూరంగా ఉండేందుకు పవన్ ప్రయత్నించినప్పుడు.. ఆయన కలిసొస్తే ప్రత్యేక హోదా ఉద్యమం చేద్దామని వైసీపీ నేతలు ఎన్నో ప్రకటనలు ఇచ్చారు. ఇక జగన్ సన్నిహితుడైన విజయసాయి రెడ్డి ఇదే విషయమై పవన్ కి బహిరంగ పిలుపులు పదేపదే ఇచ్చారు. కానీ ఇప్పుడు వైసీపీ వెనకడుగు వేస్తోంది.
ఒకప్పుడు పవన్ దోస్తీ కోసం ఆరాటపడ్డ వైసీపీ వెంటనే ఆ ఆఫర్ వాడుకోడానికి ఓ మెట్టు కిందకు దిగుతుందని అంతా భావించారు. కానీ ఆ ప్రయత్నాలేమీ జరగక పోగా రివర్స్ లో పవన్‌పై విరుచుకుపడుతున్నారు విశాఖ వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్. అయితే ఈ విషయంలో ఆయన తప్ప మరెవరూ స్పందించకపోవడం విశేషం! ప్రత్యేక హోదా అంశంలో ట్వీట్స్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కొన్ని ప్రశ్నలు సంధించారు అమర్నాధ్.హోదాకి సంబంధించి కేంద్రమంత్రి వెంకయ్యను తప్పుబట్టే పవన్ ఆ విషయంలో సీఎం చంద్రబాబుని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాకి బాబు అనుకూలమని భావిస్తున్నారా? అని పవన్ మీద అమర్నాథ్ ఎదురుదాడి చేశారు. ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని పవన్ ని అమర్నాధ్ డిమాండ్ చేశారు. అంటే హోదా పోరాటం లో పవన్ ఆఫర్ ని పక్కనబెట్టి ఆయనతో బాబుని తిట్టించడం ఇదే వైసీపీ దృష్టి పెట్టినట్టుంది.పైగా ఇంతటి కీలక అంశం మీద ఓ యువనేతని ప్రయోగించడం ద్వారా పవన్ కి తాము ఏ మాత్రం ప్రాధాన్యం ఇస్తారో చెప్పకనే చెబుతోందని విశ్లేషకుల అంచనా!!