బాహుబ‌లి రికార్డ్ బ్రేక్ చేసిన ఖైదీ

భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన అన్న‌య్య మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 అదే అంచ‌నాల‌ను కొన‌సాగిస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం అనంత‌రం వెండితెర‌పై క‌నిపించిన చిరు త‌న రేంజ్‌కి త‌గ్గ‌ట్టుగానే అంద‌రినీ అల‌రించాడు.  ఆడియో సూపర్ హిట్ కావటంతో పాటు చిరు లుక్స్ ఆకట్టుకోవటంతో ఖైదీ నంబర్ 150 భారీ ఓపెనింగ్స్ సాధించింది.

మాస్ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకోవ‌డంతో ఖైదీ మూవీపై విడుద‌ల‌కు ముందు ఉన్న అంచ‌నాలు ఇప్పుడూ కొన‌సాగుతున్నాయి. అయితే, ఇటీవ‌ల కాలంలో ఏ మూవీ విడుద‌లైనా.. జ‌క్క‌న్న బాహుబ‌లితో కంపేర్ చేయ‌డం మామూలైపోయింది. అదే సేమ్ కంపేరిజ‌న్ ఇప్పుడు అంద‌రూ ఖైదీని కూడా చేస్తున్నారు. బాహుబ‌లి-1తో ఖైదీని కంపేర్ చేస్తే.. చిరు మూవీనే రికార్డు బ్రేక్ చేసింద‌ని అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

తొలి రోజు కలెక్షన్ల విషయంలో ఖైదీ నంబర్ 150 సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా భారీ వసూళ్లను సాధించింది. ఒక్క రోజులో 39 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగెస్ట్ హిట్ గా నిలిచిన బాహుబలి తొలి రోజు 35 కోట్లు మాత్రమే రాబ‌ట్టింది.

అయితే, ఖైదీ మాత్రం ఆ రికార్డ్ ను దాటి కొత్త చరిత్ర సృష్టించాడు. తొమ్మిదేళ్ల విరామం తరువాత కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న చిరు స్టామినా చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మ‌రి రాబోయే రోజుల్లో ఖైదీ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.