2.0 తెలుగు రైట్స్ అన్ని కోట్లా…వామ్మో

ఈగ, లెజెండ్ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌ని తన ఖాతాలో వేసుకొన్న సంస్థ వారాహి చ‌ల‌న చిత్ర‌. ఈ బ్యాన‌ర్ అధినేత సాయి కొర్ర‌పాటి ఓ వైపు తెలుగులో టాప్ హీరోల‌తో సినిమ‌లు చేస్తూనే మరోవైపు చిన్న హీరోల‌తో కూడా ఉత్త‌మాభిరుచి క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. మ‌రోవైపు నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ మూవీ సాయి కొర్ర‌పాటి బ్యాన‌ర్‌లోనే ఉండ‌బోతోంది.

గౌత‌మి పుత్ర సీడెడ్ హ‌క్కుల్నీ ఆయ‌న కైవ‌సం చేసుకొన్నారు. ఇక ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్టు ఓవ‌రాల్ తెలుగు రైట్స్‌ను సైతం ఆయ‌నే సొంతం చేసుకునే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ర‌జ‌నీకాంత్ – శంక‌ర్ కాంబోపై ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. 2010లో వ‌చ్చిన ఈ సినిమా ర‌జ‌నీ, శంక‌ర్ కేరీర్‌లో పెద్ద ట్రెండ్ సెట్ చేసింది.

ఆ సినిమాకు కంటిన్యూగా వ‌స్తోన్న 2.0పై సైతం ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో భారీ అంచ‌నాలు ఉన్నాయి. శంక‌ర్ ఈ క్రేజీ ప్రాజెక్టును దాదాపు రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుపై ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు రైట్స్ సంపాదించ‌డానికి పెద్ద ఎత్తున పోటీ నెల‌కొంది. తెలుగు రైట్స్ కోసం పోటీ ప‌డుతున్న‌వాళ్ల‌లో సాయి కొర్ర‌పాటి కూడా ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం చిత్ర నిర్మాత‌లు ఏకంగా రూ.65 కోట్లు డిమాండ్ చేస్తున్నార‌ట‌. కొంద‌రు బ‌డా నిర్మాత‌లు రూ.50 కోట్ల వ‌ర‌కు వెళ్లి ఆగిన‌ట్టు తెలుస్తోంది. సాయి అంత‌కు మించి ఒక‌టో రెండో కోట్లు పెట్ట‌డానికి కూడా రెడీ అవుతున్నాడ‌ట‌. అదే జ‌రిగితే 2.0 తెలుగు రైట్స్ సాయి చేతికి చిక్క‌డం ఖాయం.