ముద్ర‌గ‌డ‌ను ఫాలో అవుతోన్న కోదండ‌రాం

ఉద్య‌మానికి పాఠాలు నేర్పిన ప్రొఫెస‌ర్.. కోదండ‌రాం! అలాంటి వ్య‌క్తి ఇప్పుడు కాపు ఉద్య‌మ నేత మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభాన్ని ఫాలో అవుతున్నాడ‌ట‌. కొంత విచిత్రంగా అనిపించినా, వినిపించినా నిజం అంటున్నారు ప‌రిశీల‌కులు! విష‌యంలోకి వెళ్లిపోతే.. తెలంగాణ ప్ర‌భుత్వం భూసేక‌ర‌ణ చ‌ట్టానికి కొన్ని స‌వ‌ర‌ణలు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక పంట పండే భూముల‌ను మాత్రమే సేక‌రించేందుకు చ‌ట్టం అనుమ‌తిస్తోంది. అయితే, దీనివ‌ల్ల మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ వంటి వాటికి కొన్ని అడ్డంకులు త‌లెత్తాయి. దీంతో భూసేక‌ర‌ణ క‌ష్టాల‌ను మొత్తంగా చుట్ట‌బెట్టి హుస్సేన్ సాగ‌ర్ క‌లిపేలా.. కేసీఆర్ ప్ర‌భుత్వం నూత‌న చ‌ట్టాన్ని ఆవిష్క‌రించింది.

తెలంగాణ స‌భ‌లో బ‌లం కేసీఆర్ కే ఉందికాబ‌ట్టి ఈ బిల్లు పెట్ట‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌నికాదు. ఇక‌, ఈ కొత్త బిల్లులో రెండు పంట‌లు పండే భూముల‌ను సైతం ప్ర‌భుత్వం తీసుకునేలా స‌వ‌ర‌ణలు చేశారు. ఇది నిజంగా రైతుల పాలిట అశ‌నిపాతంగా అని చెప్పొచ్చు. దీనిపై యుద్ధానికి సిద్ధం అవుతాయ‌ని భావించిన కాంగ్రెస్‌, టీడీపీల‌కు కేసీఆర్ ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఈ ప‌రిణామంతో తీవ్రంగా ఆగ్ర‌హించిన కోదండ రాం.. ప్ర‌భుత్వంపై దీక్షా యుద్ధానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే స్థానిక ఇందిరా పార్కులో గురువారం దీక్ష‌కు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. క‌లిసొచ్చే నేత‌ల‌ను కూడ‌గ‌ట్టారు.

అంతాబాగానే ఉన్నా.. చివ‌రి నిమిషంలో పోలీసులు దీక్ష‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో అవాక్క‌యిన కోదండ‌రాం.. దీక్ష‌ను ఎలాగైనా చేసి తీరాల‌ని నిర్ణ‌యించుకుని ఏపీలో ముద్ర‌గ‌డ అవ‌లంబిస్తున్న విధంగా త‌న దీక్ష‌ను ఇంటి నుంచే ప్రారంభించారు. ఏపీలోనూ కాపు రిజ‌ర్వేష‌న్ కోసం డిమాండ్ చేస్తున్న ముద్ర‌గడ దీక్ష‌కు పిలుపు ఇవ్వ‌డం, ప్ర‌భుత్వం ఏదో ఒక వంక‌తో దానికి అనుమ‌తి లేద‌ని చెప్ప‌డం తెలిసిందే.ఈ క్ర‌మంలో ఆయ‌న కూడా ఇంటి నుంచే దీక్ష‌ల‌కు దిగడం మొన్నామ‌ధ్య అది పెద్ద ర‌చ్చ‌కావ‌డం తెలిసింది. ఇదే ఫార్ములాను తెలంగాణ లో కోదండ‌రాం ఓన్ చేసుకున్నారు.

అనుమ‌తి, గినుమ‌తి నౌ! అంటూ త‌న ఇంటినే వేదిక‌గా చేసుకుని.. త‌న చుట్టూ ఉన్న నేత‌ల‌తోనే క‌లిసి దండ ధ‌రించి దీక్ష‌కు దిగారు కోదండ‌రాం. మ‌రోప‌క్క‌, తెలంగాణ అసెంబ్లీలో త‌మ‌కు మాట్లాడే ఛాన్స్ ద‌క్క‌క‌పోవ‌డంతో మూకుమ్మ‌డిగా వాకౌట్ చేసిన కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాల నేత‌లు కోదండ‌రాంకి సంఘీభావం తెలిపేందుకు క్యూక‌ట్టారు. మొత్తానికి కోదండ రాం చేప‌ట్టిన దీక్ష‌పైనే ఇప్పుడు అంద‌రి చ‌ర్చ‌లూ సాగుతున్నాయి. ఆయ‌న ముద్ర‌గ‌డ‌ను కాపీ కొట్టాడా? అనే కోణంలో ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి భ‌విష్య‌త్తులో ఇంకెలాంటి ఉద్య‌మాలు చేప‌డ‌తారో చూడాలి.