థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోన్న త‌మిళ పాలిటిక్స్‌

త‌మిళ‌నాడు అధికార పార్టీ అన్నాడీఎంకే కేంద్రంగా పాలిటిక్స్ ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ సీఎం సీటును ద‌క్కించుకునేందుకు తీవ్ర‌స్థాయిలో చ‌క్రం తిప్పిన వార్త‌లు పెద్ద ఎత్తున సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ క్ర‌మంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం మూకుమ్మ‌డిగా పోయెస్ గార్డెన్‌కు వెళ్లి.. చిన్న‌మ్మ‌కు సాష్టాంగ‌న‌మ‌స్కారం చేసి.. పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని సైతం విన్న‌వించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇంత‌లో రాష్ట్రంలో వ‌ర్ద పెను తుఫాను.. అనంత‌రం సీఎం ప‌న్నీర్ సెల్వం.. ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసిరావ‌డం జ‌రిగాయి.

ఇక‌, ఆ త‌ర్వాతే రాష్ట్రంలో ప‌రిస్థితులు వేగంగా మారిపోయాయి. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పీ రామ్మోహ‌న్‌రావ్ ఇంటిపై ఐటీ దాడులు రాష్ట్రంలో వేడి పుట్టించాయి. ఇప్ప‌టికీ ఐటీ దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇక‌, ఈ క్ర‌మంలో ఏమైందో ఏమో.. ఒక్క‌సారిగా పోయెస్ గార్డెన్ ప్ర‌భావం ప‌డిపోయింది. చిన్న‌మ్మ ద‌గ్గ‌ర‌కు క్యూ క‌ట్టిన నేత‌లు ఇప్ప‌డు క‌నుమ‌రుగైపోయారు. మ‌రోప‌క్క‌, విప‌క్షాలు కూడా పోయెస్ గార్డెన్‌లో ఏం జ‌రుగుతోందో అని వెయ్యి క‌ళ్ల‌తో నిఘాను ముమ్మ‌రం చేశాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల రాష్ట్రంలోని 11 వ‌ర్సిటీల‌కు చెందిన వీసీలు శ‌శిక‌ళ‌ను క‌లుసుకోవ‌డం పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది.

ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌, వామపక్షాల నాయకులంతా శశికళను కలుసుకున్న వైస్‌ఛాన్సలర్లను డిస్మిస్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై స్టాలిన గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ గవర్నర్‌కు ఓ లేఖను కూడా పంపారు. ఈ విషయంలో విశ్వవిద్యాలయాలన్నింటికీ ఛాన్సలర్‌గా ఉన్న రాష్ట్ర గవర్నర్‌ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో శశికళను వైస్‌ఛాన్సలర్లు కలుసుకోవడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు రాజ్‌భవన్‌ అధికారులు నోటీసు జారీ చేసినట్టు సచివాలయ అధికార వర్గాలు తెలిపాయి.

మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం ఏంటంటే.. పోయెస్ గార్డెన్‌కు ఉన్న దాదాపు 240 మంది పోలీసుల భ‌ద్ర‌త‌ను తీసివేయ‌డం. ఇది కూడా విప‌క్షాల విమ‌ర్శ‌ల‌తో ప్ర‌భుత్వం హుటాహుటిన తీసుకున్న నిర్ణ‌యంగా క‌నిపిస్తున్నా.. ప‌న్నీర్ క‌నుస‌న్న‌ల్లోనే ఇది జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి త‌న సీఎం సీటును ప‌దిలం చేసుకునే క్ర‌మంలోనే ప‌న్నీర్ ఇవ‌న్నీ చేయిస్తున్నాడ‌నే మ‌రో టాక్ వినిపిస్తోంది. మ‌రో రెండు రోజుల్లో అన్నాడీఎంకే కార్య‌వ‌ర్గ స‌మావేశం ఉంది. దీనిలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శ‌శిక‌ళ‌ను ఎన్నుకోవాల‌ని ఇప్ప‌టి వ‌ర‌కు అనుకున్నా.. చివ‌రి నిమిషంలో ప‌రిస్థితి ఎలా మారుతుందో చూడాలి! మొత్తానికి త‌మిళ‌నాడు పాలిటిక్స్ థ్రిల్ల‌ర్ మూవీని త‌ల‌పిస్తున్నాయి.