జ‌య మృతిపై అనుమానాలు – అస‌లు నిజాలు..!

దివంగ‌త త‌మిళ‌నాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత‌ల అమ్మ‌.. పురుట్చిత‌లైవి జ‌య‌ల‌లిత మృతి చెందిన మూడు వారాల త‌ర్వాత ఇప్పుడు ఆమె మృత దేహానికి పోస్ట్ మార్ట‌మ్ చేయ‌నున్నారా? ఆమె మృతిపై అనుమానాలున్నాయ‌నే వార్త‌లు నిజ‌మేనా? ఆమెపై విష ప్ర‌యోగం జ‌రిగింద‌నే కామెంట్ల‌కు ఇప్పుడు బ‌లం చేకూరుతోందా? జ‌య‌ది సాధార‌ణ మ‌ర‌ణం కాదా? ఇప్పుడు ఇలాంటి అనుమానాలు తమిళనాడు ప్రజలనే కాదు చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల జనాల్నిసైతం మ‌రోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జ‌య ఆస్ప‌త్రిలో చేరిన నాటి నుంచి ఆమె ఆరోగ్యంపై అనేక వ‌దంతులు వ‌చ్చాయి.

అస‌లు అమ్మ‌కు జ‌రుగుతున్న వైద్యం ఏమిటో చెప్పాల‌ని అపోలో ఆస్ప‌త్రిపై సైతం వ‌త్తిడి వ‌చ్చింది. అయినా కూడా ఎక్క‌డా జ‌య ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యులు వెల్ల‌డించ‌లేదు. ఇక‌, జ‌య ఎప్పుడు మ‌ర‌ణించారో కూడా సందేహ‌మే. ఎందుకంటే.. జ‌య ఇక‌లేరంటూ.. ఆస్ప‌త్రి ప్ర‌క‌ట‌న‌క‌న్నాముందుగానే అన్నాడీఎంకే కార్యాల‌యంలో జెండాను అవ‌న‌తం చేయ‌డం, ప‌న్నీర్ సెల్వంను సీఎంగా ఎంపిక చేయ‌డం, కేంద్రం నుంచి భారీ ఎత్తున బ‌ల‌గాల‌ను చెన్నైకి త‌ర‌లించ‌డం వంటివి జ‌రిగిన నేప‌థ్యంలో అమ్మ మృతిపై అనేక సందేహాలు క‌మ్ముకున్నాయి.

ఈ క్ర‌మంలోనే సినీ న‌టి గౌత‌మి.. ప్ర‌ధానికి లేఖ కూడా రాసింది. ఇక ఇప్పుడు తాజాగా.. అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ అమ్మ మృతిపై అనుమానాలున్నాయంటూ మ‌ద్రాస్ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం వేశాడు. దీనిని విచారించిన హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ వైద్య‌లింగం.. త‌న‌కు కూడా జ‌య మృతిపై అనేక అనుమానాలున్నాయ‌ని అన‌డం సంచ‌ల‌నం సృష్టించింది. అంతేకాదు, జ‌య మృతదేహాన్ని వెలికి తీసి మళ్లీ పరీక్షించాలని తాము ఎందుకు ఆదేశించకూడదని ఆయ‌న ప్ర‌శ్నించారు. జ‌య‌ ఆసుపత్రిలో చేరినప్పుడు బాగానే ఆహారం తీసుకునేవారన్న విషయాన్ని గుర్తు చేశారు.

అంతేకాదు, వైద్యం వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారన్న ప్రశ్నతో పాటు.. అలా ఎందుకు చేశారంటూ సూటిగానే ప్రశ్నించారు. తొలుత జ్వరం కారణంగా జయను ఆసుపత్రిలో చేర్పించారని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని వార్తలు వచ్చాయని.. అలా జరగలేదని.. జయ ఆరోగ్యం అంతకంతకూ క్షీణించిందంటూ అపోలో ఆసుపత్రి యాజమాన్యం బులిటెన్లు విడుదల చేశారని పిటిష‌న‌ర్ పేర్కొన్న విష‌యాల‌ను న్యాయ‌మూర్తి వైద్య‌లింగం ఉటంకించారు. దీంతో ఇప్పుడీ వ్యాఖ్య‌లు తీవ్ర సంచ‌ల‌నంగా మారాయి. న్యాయ‌మూర్తి చెప్పిన‌ట్టు ఇప్పుడు గ‌న‌క జ‌య మృత‌దేహానికి మ‌ళ్లీ పోస్ట్‌మార్ట‌మ్ అంటే.. మ‌రింత సంచ‌ల‌నంగా మారే అవ‌కాశంతోపాటు అసలు నిజాలు వెలుగులోకి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏం జ‌రుగుతుందో చూడాలి.