కేంద్ర మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తిరాజుకు దిమ్మ తిరిగిందా

టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తి రాజుకి దిమ్మ‌తిరిగిపోయింది! తాను చేసిన కామెంట్‌కి కౌంట‌ర్ ఘాటుగా ఉండే స‌రికి మైండ్ బ్లాంక్ కూడా అయింద‌ట రాజుగారికి!! తానేదో మంత్రి హోదాలో ఓ కామెంట్ విసిరితే.. త‌న‌పై అంతే రివ‌ర్స్‌లో ఇంత ఘాటు కౌంటర్ రువ్వాలా? అని రాజుగారు ఇప్పుడు తెగ ఇదైపోతున్నార‌ట‌. ఎప్పుడూ ఎంతో గంభీరంగా.. తాను ఎవ‌రినీ లెక్క‌చేయ‌ను అనేధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించే మంత్రి రాజుగారికి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ఆ ఉదంతం ఏంటో తెలిస్తే.. మీరు కూడా ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం.. మ‌రి విష‌యంలోకి వెళ్లిపోదాం.. వ‌చ్చేయండి..

కేంద్ర పౌర విమాన‌యాన మంత్రిగా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు.. తాజాగా ఎయిర్ ఇండియా ఆదాయ వ్య‌యాలను మ‌ధించార‌ట‌. అదేస‌మ‌యంలో ప్రైవేటు విమాన సంస్థల ఆదాయ వ్య‌యాల‌ను కూడా అధ్య‌య‌నం చేశార‌ట‌. దీంతో ఈ రెంటికీ మ‌ధ్య తీవ్ర వ్య‌త్యాసం ఉంద‌ని తెలిసింది. ఇంకేముంది.. త‌న శాఖ‌లోని ఉద్యోగుల‌ను పిలిచి త‌న స్టైల్లో క్లాస్ ఇచ్చేశారు. మీలో నిబ‌ద్ధ‌త లేక‌పోవ‌డం వ‌ల్లే ఎయిర్ ఇండియా ఆదాయంలో లోటు క‌నిపిస్తోంద‌ని అన్నార‌ట‌. అంత‌టితో ఆగ‌కుండా.. మ‌రో ప్రైవేటు సంస్థ‌తో పోల్చుతూ.. అది అంత సంపాదించింది.. మ‌నం ఎందుకు వెనుక‌బ‌డ్డా. వెరీ పూర్ వెరీ పూర్ అన్నార‌ట‌.

ఏం చేస్తారు పాపం.. ఉద్యోగులు మౌనంగా విని ఊరుకున్నారు. అయితే, వీరిలో గ‌డుసు పిండం.. శుభాషిస్ మంజుందార్ అనే పైల‌ట్ మంత్రి గారికి షాక్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యాడు. అంతే.. ఇంకేముంది.. ప‌దునైన ప‌ద‌జాలంతో.. ఏకిపారేశాడు. అయ్యా మంత్రిగారూ.. ‘మా సంగ‌తి స‌రే… దేశంపై బాధ్య‌త ఉండాల్సిన మీరేం చేస్తున్నారు? గ‌డ‌చిన పార్ల‌మెంటు స‌మావేశాల్లో విలువైన 92 గంట‌ల స‌మ‌యాన్ని వృథా చేశారు. ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తోనే కాలం గ‌డిపేశారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌లేక‌పోయారు. స‌భ స‌జావుగా సాగ‌కుండా అడ్డుప‌డట‌మే క‌దా మీరు చేసింది. ఇత‌ర దేశాల చ‌ట్ట స‌భ‌ల‌తో పోల్చి చూస్తే మీరు ఎక్క‌డున్నారో చూసుకోండి’ అంటూ లేఖ‌లో వాయించేశాడు.

ఇంకేముంది! మంత్రి ఈ లేఖ‌ను చూసి.. అవాక‌య్యాడ‌ట‌! ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే… ఇప్పుడీ పైలెట్ లేఖ‌కు నెటిజ‌న్ల మ‌ద్ద‌తు కూడా ల‌భిస్తోంది. ఆ పైలెట్ రాసింది నిజ‌మే క‌దా అంటూ చాలామంది స‌మ‌ర్థిస్తున్నారు. దీంతో మంత్రి గారికి నిద్ర ప‌ట్ట‌డం లేద‌ట‌! త‌న జీవితంలో ఎన్నో చూశాను. కానీ, ఓ ఉద్యోగికి ఇలా దొరికిపోయానేంట్రా దేవుడా అని నెత్తీ నోరూ బాదుకుంటున్నార‌ట రాజుగారు!!