అమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచానికి తుమ్ములు వస్తాయన్న నానుడి మరోసారి రుజువైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్నాయి. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ లీడర్‌గా అందరి దృష్టినీ ఆకర్షించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. సౌమ్యురాలు, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ల మధ్య పోరు క్షణ క్షణానికి ఉత్కంఠగా మారుతోంది. నిమిషాల వ్యవధిలోనే ఆధిక్యం తారుమారవుతోంది. డొనాల్డ్‌దే ఆధిక్యం అని అనుకున్న తదుపరి నిమిషంలోనే హిల్లరీ.. కాదు..కాదు.. హిల్లరీ గ్యారెంటీ అనుకున్న మరుసటి నిమిషంలో డొనాల్డ్ పైచేయి సాధించడం.. ఇలా జరుగుతున్న హోరా హోరీ పోరు.. ప్రపంచ మార్కెట్‌పై పెను ప్రభావం చూపుతోంది.
వాస్తవానికి ప్రపంచ దేశాల్లో మెజారిటీ ప్రజలకు ట్రంప్‌పై వ్యతిరేక భావన ఉంది. ఆయన వస్తే.. విదేశీయులను వెళ్లగొడతాడని, ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని, వీసాపైనా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్న క్రమంలో స్టాక్ మార్కెట్టు కుప్పకూలుతున్నాయి. మదుపరులు తమ పెట్టుబడులను బంగారం, వెండిపైకి మళ్లిస్తున్నారు. దీంతో ఈ రెండింటి ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం కొద్దిగా తగ్గిందనుకున్న పసిడి మార్కెట్ నేటి ఉదయం ట్రంప్ ఆధిక్యంలోకి రావడంతో గత ఏడాది డిసెంబర్లో ఉన్న పది గ్రాముల ధర 31 వేల పైచిలుకు చేరింది. స్పాట్ గోల్డ్ ఒక్క ఔన్స్ కు 2.9 శాతం పెరిగి 1,311 డాలర్లుగా నమోదవుతోంది. బులియన్ కూడా 1,312.80 డాలర్లకు ఎగిసింది.
అక్టోబర్ 4 తర్వాత ఇదే బలమైన నమోదు కావడం గమనార్హమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ గెలిస్తే, కమొడిటీలకు లబ్ది చేకూరుతుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. దీంతో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1,405 పెరిగింది. దీంతో సుమరు రూ. 31,285 (డిసెంబర్ నాటి ధర)కు చేరుకుంది. అదేవిధంగా వెండి ధర కిలోకు రూ. 1,412 పెరిగి రూ. 44,721కి చేరింది. అధ్యక్ష ఫలితాలను బట్టి మరింత మార్పలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతుండడం గమనార్హం. ఒకవేళ ట్రంప్‌కే కనుక అధ్యక్ష పీఠం దక్కితే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రానున్న రెండు మూడు రోజుల్లోనే రూ.35 వేలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతుండడం విశేషం.