2019లో కొత్త మిత్రులుగా మోడీ – కేసీఆర్‌

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రికి మిత్రులు అవుతారో? ఎప్పుడు ఎవ‌రికి ఎవ‌రు ఎలా శ‌త్రువులు అవుతారో చెప్ప‌డం క‌ష్టం! ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అక్క‌డికే వ‌ద్దాం.. మొన్న‌టి వ‌ర‌కు కేంద్రం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఏపీకే అన్నీ ఇస్తోంద‌ని గుస్సా పోయిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు అదే కేంద్ర ప్ర‌భుత్వంతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేందుకు సిద్ధ‌మ‌య్యారు. పెద్ద నోట్ల ర‌ద్దుపై దేశ వ్యాప్తంగా గ‌గ్గోలు పుడుతున్నా.. ఢిల్లీ, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల సీఎంలు పెద్ద ఎత్తున రోడ్ల మీద‌కు వ‌చ్చి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం చాలా గుంభ‌నంగా ఉంటున్నారు.

అయితే, పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావం తెలంగాణ మీద ప‌డ‌లేదా? అంటే బాగానే ప‌డింది. పెద్ద పెద్ద మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. చిన్న వ్యాపారాలు మూత‌బ‌డ్డాయి. ఈ క్ర‌మంలో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసిన కేసీఆర్‌.. త‌ర్వాత మాత్రం కేంద్రంపై ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనేఆయ‌న ఎంపీల‌కు దిశానిర్దేశం కూడా చేశారు. ఇక‌, ఇద‌లావుంచితే. కేంద్రంలోని మోడీ నుంచి కేసీఆర్ కు ఆహ్వానం అందింది వెంట‌నే ఢిల్లీకి రావాల‌ని ఆయ‌న క‌బురు పెట్టారు. దీంతో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ప్రధానికి ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు.

పెద్ద నోట్ల ర‌ద్దు తో తెలంగాణ ఆదాయం కోల్పోయిన విధానంపై వివ‌రించారు. అయితే, ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విషయం ఏంటంటే.. కేసీఆర్ ఎక్క‌డా ఆవేశ ప‌డ‌లేదు. దీనిని బ‌ట్టి ఆయ‌న కేంద్రంతో తెగ‌తెంపులు చేసుకోకూడ‌ద‌నే నిశ్చ‌యంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఇప్పుడు కేంద్రం కూడా కేసీఆర్‌తో చెలిమికి త‌హ‌త‌హ లాడుతోంది.

ప్ర‌స్తుత ప‌రిస్థితిలో 2019 ఎన్నిక‌లలో బీజేపీ హ‌వా త‌గ్గే సూచ‌న‌లు ఉన్నాయ‌ని, దీంతో ద‌క్షిణాది లో బ‌లంగా ఉన్న ప్రాంతీయ పార్టీ టీఆర్ ఎస్‌తో చెలిమి చేయ‌డం త‌మ‌కు లాభిస్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌కు ఆహ్వానం పంపి మ‌రీ పెద్ద నోట్ల‌పై చ‌ర్చించార‌ని తెలుస్తోంది. మొత్తానికి ఈ ప‌రిణామం ఏ మ‌లుపు తిరుగుతుందో చూడాలి.