మాజీ సీఎం కిరణ్ మ‌రోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబుతున్నారా!

ఓ ప్ర‌ధానమైన‌ రాష్ట్రానికి ఎవ‌రూ ఊహించ‌నివిధంగా ముఖ్య‌మంత్రి స్థాయికెదిగిపోయి… ఆ త‌రువాత అంతే నాట‌కీయంగా… రాజ‌కీయ య‌వ‌నిక పైనుంచి దాదాపు తెర‌మరుగైపోయిన విచిత్ర గాథ న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డిది.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు నల్లారి ఆఖరి ముఖ్యమంత్రి. విభజన వద్దని గట్టిగా పోరాడి, ఆపై ‘సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ప‌రాజ‌యం మూట‌గట్టుకున్న‌వైనం అంద‌రికీ తెలిసిందే. ఈ ప‌రిణామాల త‌రువాత కిరణ్‌కుమార్‌రెడ్డి దాదాపుగా రాజ‌కీయ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామంలోనే వ్యవసాయ పనులు చూసుకుంటూ కాలం గడుపుతున్నారు.

అయితే ఆయ‌న ఇప్పుడు మ‌రోసారి ఏపీ రాజ‌కీయాల్లో త‌న అదృష్టాన్నిప‌రీక్షించుకునేందుకు పావులు క‌దుపుతున్నారా…? అంటే… తాజాగా ఆయ‌న సొంత జిల్లాలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు చూస్తే నిజ‌మేన‌నిపిస్తోంది.  ఇటీవ‌ల కిర‌ణ్‌ చిత్తూరు జిల్లా గుర్రంకొండ పంచాయతీ ఆఫీసుకు వచ్చి అభిమానులు, కార్యకర్తలను పలకరించారు. అందరినీ పేరు పేరునా క్షేమస‌మాచారాలు అడిగిమ‌రీ తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఓ కార్యకర్త  కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని… రాజకీయాల‌పై త్వ‌ర‌గా ఏదో ఒక నిర్ణ‌యం తీసుకొమ్మ‌ని, త‌మ‌కూ దారిచూపించాల‌ని ముక్కు సూటిగా ప్ర‌శ్నించ‌డంతో స్పందించిన మాజీ ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ … ఇప్పటికే పెళ్లి కుదిరింద‌ని… పెళ్లి కూతురు ఎవరన్నది మాత్రం ప్ర‌స్తుతానికి రహస్యమ‌ని… త్వరలోనే తాళిబొట్టు కట్టే ముహూర్తం తేలగానే అంద‌రికీ స్వ‌యంగా చెపుతాన‌ని, శుభలేఖలు అందరికీ వస్తాయ‌నీ చెప్పారు. దీంతో సొంత జిల్లాలోని ఆయ‌న అనుచ‌రుల్లో ఇప్పుడు కిర‌ణ్ వ్యాఖ్య‌లు పెద్ద చ‌ర్చ‌నే లేవ‌దీశాయి.

మొత్తంమీద మరో రాజకీయ పార్టీతో కలిసి నడిచేందుకు కిర‌ణ్ నిర్ణ‌యించుకున్నార‌ని తేలిపోవ‌డంతో.. ఇక రాజ‌కీయ‌వ‌ర్గాల్లో.. ఎవరి ఊహల్లోకి వారు వెళ్లిపోయి, ఏ పార్టీతో పొత్తుకు నల్లారి కిరణ్ ప్రయత్నిస్తున్నారన్న విషయమై మాట్లాడుకుంటున్నారు.  ఈ నేప‌థ్యంలోకిర‌ణ్‌కుమార్‌రెడ్డి… జగన్ నేతృత్వంలోని వైసీపీలోకి వెళ్లవచ్చని కొందరు, ఆయ‌న ఇప్ప‌టికే టీడీపీతో మాట్లాడి ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చారని మరికొందరు, గతంలో విడిపోయిన కాంగ్రెస్ లోనే తిరిగి సమైక్యాంధ్ర పార్టీని విలీనం చేయ‌బోతున్నారని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంకొన్నిరోజులు వేచిచూస్తే న‌ల్లారి వారి చూపు ఎటు ఉందో స్ప‌ష్టంగానే తేలిపోనుంద‌న్న‌మాట‌.