టీడీపీలో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే బిగ్ ఫైట్‌

అనంత‌పురం జిల్లా టీడీపీ నేత‌ల మ‌ధ్య వార్ వీధుల్లోకి చేరింది. అనంత ఎంపీ జేసీ బ్ర‌ద‌ర్ దివాక‌ర్ రెడ్డి.. అనంత ఎమ్మెల్యే(ఇద్ద‌రూ టీడీపీనే) ప్ర‌భాక‌ర చౌద‌రిల మ‌ధ్య ఫైటింగ్ పీక్ స్టేజ్‌కి చేరింది! ప్ర‌భాక‌ర్ రెడ్డికి ఏదో ర‌కంగా పొగ‌బెట్టాల‌ని జేసీ బ్ర‌ద‌ర్స్‌, వీళ్ల ఆధిప‌త్యానికి ఎలాగోలా గండి కొట్టాల‌ని ప్ర‌భాక‌ర్ ఎన్నాళ్లుగానో ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌తంలో జేసీ కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టి నుంచి ప‌రిస్థితి ఇంతే. అయితే, ఇప్పుడు అటు జేసీ, ఇటు ప్ర‌భాక‌ర్ ఇద్ద‌రూ టీడీపీలోనే ఉండ‌డంతో ఈ వార్ మ‌రింత ముదిరింది. ఇప్పుడు ఏకండా రోడ్ల మీద‌కి చేరింది.

అనంత‌పురంలో రోడ్ల విస్త‌ర‌ణ అంశం ప్ర‌స్తుతం అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య క‌య్యానికి కార‌ణ‌మైంది. రోడ్ల విస్త‌ర‌ణ కోసం అంటూ తిల‌క్ న‌గ‌ర్‌, గాంధీ బ‌జార్‌ల‌లోని రోడ్ల‌ను విస్త‌రించేందుకు అధికారులు సిద్ధ‌మ‌య్యారు. అక్క‌డి రోడ్డ‌కు ఇరువైపులా ఉన్న క‌ట్ట‌డాల‌ను కూల్చే ప‌నిలో ఉన్నారు. అయితే, దీనిని ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి అడ్డుకున్నారు. ఇక్క‌డి రోడ్ల‌ను విస్త‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఈ రెండు రోడ్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా రోడ్ల‌ను నిర్మించామ‌ని చెప్పారు. అయితే, జేసీ దివాక‌ర్ రెడ్డి మాత్రం తీవ్రంగా ఫైర‌య్యారు. రోడ్ల విస్త‌ర‌ణ జ‌రిగి తీరాల్సిందేన‌ని చెప్పారు.

తానే స్వ‌యంగా రోడ్ల విస్త‌ర‌ణ‌కు రంగం సిద్ధం చేసిన‌ట్టు ఆయ‌న చెప్పారు. ప్ర‌భాక‌ర్ చౌద‌రికి వ్య‌తిరేకంగా మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆఫీస్ వ‌ద్ద దీక్ష‌కు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. అయితే, ప్ర‌భాక‌ర్ చౌద‌రికి మ‌ద్ద‌తుగా మైనార్టీ వ‌ర్గం రంగంలోకి దిగింది. రోడ్ల విస్త‌ర‌ణ పేరిట మ‌సీదులు ప‌గ‌ల గొడితే చూస్తూ కూర్చోబోమ‌ని హెచ్చ‌రించారు. ఇంత‌లో ఈ విష‌యం తెలిసిన విజ‌య‌వాడ‌లోని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం.. అనంత క‌లెక్ట‌ర్‌ని, ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర చౌద‌రిని అర్జంటుగా రావాల‌ని క‌బురు పెట్టింది. మొత్తానికి అనంత టీడీపీలో ఫైటింగ్ పీక్ స్టేజ్‌కి చేర‌డం గ‌మ‌నార్హం.