గాలి వారింట పెళ్లి కూతురి చీర‌, న‌గ‌ల ఖ‌రీదు తెలిస్తే…!

గ‌నుల మ‌హ‌రాజ్‌.. గాలి జ‌నార్ద‌నరెడ్డి త‌న కుమార్తె బ్రాహ్మ‌ణి వివాహాన్ని అంగ‌రంగ వైభ‌వంగా చేస్తున్న విషయం తెలిసిందే. బుధ‌వారం బెంగ‌ళూరు ప్యాలెస్‌లో జ‌రుగుతున్న ఈ పెళ్లిపైనే దేశం మొత్తం దృష్టి పెట్టింది. వాస్త‌వానికి నోట్ల ర‌ద్దు విష‌యం పెద్ద టాపిక్ కాక‌పోయి ఉంటే గాలి వారింట పెళ్లికి మించిన పెద్ద టాపిక్ ఇంకోటి ఉండేది కాదు!! ఆకాశ మంత పెళ్లిపంద‌రి, భూదేవంత పెళ్లి పీట అనే మాట‌లు ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం కేవ‌లం విన్నాం. కానీ, గాలి మాత్రం నిజంగానే చేసి చూపిస్తున్నారు. దాదాపు 70 ఎక‌రాల స్థ‌లంలో వేసిన భారీ సెట్టింగులు, పెద్ద పెద్ద వేదిక‌లు, అంబ‌రాన్నంటే సంబ‌రాల‌తో త‌న కుమార్తె వివాహాన్ని నిర్వ‌హిస్తున్నారు.

ఇప్ప‌టికే, ఈ పెళ్లికి సంబంధించిన ఆహ్వాన ప‌త్రిక‌తోనే దేశం మొత్తం దృష్టిని ఆక‌ర్షించిన గాలి.. ఈ పెళ్లికి కోట్లు కుమ్మ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు తాజాగా.. జ‌నార్ద‌న రెడ్డి ముద్దుల కుమార్తె.. పెళ్లి కూతురు బ్రాహ్మ‌ణికి పెళ్లి సంద‌ర్భంగా కొనుగోలు చేసిన పెళ్లి చీర‌, న‌గ‌ల ఖ‌రీదు పై ఇప్పుడు హాట్ టాపిక్ న‌డుస్తోంది. బ్రహ్మణి పెళ్లి పీటలపై కూర్చునే సమయంలో ఆమె కట్టుకునే చీర దగ్గర్నుంచి పెట్టుకునే ఆభరణాల దాకా అన్నీ అత్యంత ఖ‌రీదైన‌వ‌ట‌!! బ్రాహ్మ‌ణి కట్టుకునే  పెళ్లి చీర ఖరీదు అక్షరాల రూ.17 కోట్ల రూపాయలట. ఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌తో ఎన్నో రోజులుగా ఈ చీరను తయారు చేయించారట.

అంతేకాదు, ఆమె ధరించే నగల ఖరీదు ఏకంగా రూ.90 కోట్ల రూపాయలట‌!!  ఇంకా ఎన్నో సంచలనాలకు గాలి జనార్థనరెడ్డి కూతురి పెళ్లి వేదిక కాబోతోంది. ఇక‌, ఈ పెళ్లికి గాలి జ‌నార్ద‌న రెడ్డి.. పొలిటిక‌ల్, సినీ ప్ర‌ముఖుల‌నే కాకుండా క్రికెట్ త‌దిత‌ర క్రీడా ప్ర‌ముఖుల‌ను కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించారు. ఇది స‌హ‌జ‌మే!! కానీ, గాలి మ‌రో సంచ‌ల‌న ఆహ్వానం పంపారు. అదేంటంటే.. మొత్తం క‌ర్ణాట‌క రాష్ట్ర జ‌నాభాని ఆయ‌న ఈ పెళ్లికి ఆహ్వానించారు. వీరికి కూడా దాదాపు 500 ర‌కాల వంట‌కాల‌తో పెద్ద ఎత్తున విందు ఇస్తున్నార‌ట‌. సెల‌బ్రిటీల‌కు మాత్రం 1000 ర‌కాల దేశ విదేశీ వంట‌కాల‌ను సిద్ధం చేసేశారు. ఈ మొత్తం పెళ్లిని క‌ర్ణాట‌క‌లోని జనార్థనరెడ్డి, శ్రీరాములు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కన్నడ చానల్ లైవ్ రిలే చేస్తోంది.