ఏపీ బాస‌రకు సూప‌ర్ హంగులు..ఎక్క‌డో తెలుసా..!

తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసర జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌ ప‌నిలేదు. ఈ ఆల‌యంలో చిన్నారుల‌కు అక్ష‌రాభ్యాసం చేయ‌డం వ‌ల్ల ఉన్న‌త చ‌దువులు చ‌దివి జీవితంలో అత్యున్న‌త శిఖ‌రాల‌కు ఎదుగుతార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారంలో ఉంది. దీంతో దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వ‌చ్చి త‌మ చిన్నారుల‌కు అక్ష‌రాభ్యాసం చేయిస్తారు. దీంతో ఈ ఆల‌యం దేశ వ్యాప్తంగా ఫేమ‌స్‌! ఇక‌, ఇప్పుడు ఇదే త‌ర‌హాలో ఏపీలోనూ కోట‌ప్ప‌కొండ ద‌క్షిణామూర్తి ఆల‌యాన్ని డెవ‌ల‌ప్ చేశారు. అంతేకాదు, అక్ష‌రాభ్యాసాల‌కు కేరాఫ్‌గా ఈ ఆల‌యాన్ని త‌యారు చేశారు.

ఏపీ రాజ‌ధాని జిల్లా గుంటూరుకు స‌మీపంలోని కోట‌ప్ప‌కొండ శివాల‌యానికి ఎన్నో ఏళ్ల చ‌రిత్ర ఉంది. ఇక్క‌డి శివ‌మూర్తి ద‌క్షిణా మూర్తి స్వ‌రూపం. ద‌క్షిణామూర్తి అంటే.. జ్ఞానానికి ప్ర‌తీక‌. ఆయ‌నను ఆరాధించ‌డం, ధ్యానం చేయ‌డం ద్వారా జ్ఞాన స‌ముపార్జ‌న ఉతృష్ట‌స్థాయిలో ఉంటుంద‌ని పెద్దల విశ్వాసం. ఈ క్ర‌మంలోనే ఈ ఆల‌యంపై దృష్టి పెట్టిన ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు.. ఆల‌య‌న అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఒక‌ప్పుడు కేవ‌లం మెట్ల మార్గం త‌ప్ప మ‌రోదారి లేని ఈ ఆల‌యానికి పెద్ద ఎత్తున ఘాట్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్డు వెంబ‌డి పెద్ద ఎత్తున ఆహ్లాద‌క‌ర, ప‌ర్యాట‌క వాతావ‌ణాన్ని క‌ల్పించారు.

ఐదు వందల వాహనాలను పార్కింగ్‌ చేసుకునే సౌకర్యం, ధ్యానమందిరం, భక్తులకు పూజ చేసుకునేందుకు అభిషేక మండపం, భక్తులు ఉండడానికి వసతి గృహాలు ఏర్పాటు చేయడంలో ‘కోడెల’ కృషి ఎంతో ఉంది. ఘాట్‌రోడ్డు మధ్యన పిల్లల కొరకు బోటింగ్‌,జూ, ఆటస్థలం ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతం ప‌ర్యాట‌కంగా ఆపై ఆధ్యాత్మికంగానూ డెవ‌ల‌ప్ అవుతుంద‌ని స్పీక‌ర్ ప్లాన్‌! అనుకున్న‌దే త‌డువుగా నిధులు కేటాయించారు. ప్ర‌భుత్వం నుంచి కూడా నిధులు  వ‌చ్చేలా చూశారు.

ఘాట్‌రోడ్డు పొడువున బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల విగ్రహాలను ప్రతిష్టించడం, కొండ కింద నుంచి పై వరకు రోప్‌వేను నిర్మించారు. ఇక‌, టీటీడీ ఆధ్వర్యంలో వేదపాఠశాల నిర్మాణం, వసతి గృహాల నిర్మాణం మరియు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సౌండ్‌తో కూడిన లైట్‌షో నిర్మాణం జరగబోతున్నాయి.  ఇక్క‌డ ప‌ర్య‌టించిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, సీఎం చంద్ర‌బాబులు సైతం కోడెల కృషిని మెచ్చుకున్నారు. ఇలా.. ఏపీ బాస‌ర‌గా కోట‌ప్ప‌కొండ భ‌క్తుల‌కు అందివ‌చ్చింద‌న్న మాట‌.