ఆప‌రేష‌న్ రెడ్డి స్టార్ట్ చేసిన చంద్ర‌బాబు

రాజ‌కీయాల్లో ఈక్వేష‌న్స్ ఎప్ప‌టిక‌ప్పుడు మారి పోతుంటాయి! పాలిటిక్స్‌లో మ‌న బ‌లం ఎంత ఉంద‌న్న‌ది ప్ర‌ధానం కాదు.. ఎదుటి వాడి బ‌లాన్ని బ‌ట్టి మ‌నం బ‌లంగా ఉన్నామో?  లేదో చూసుకోవ‌డం ప్ర‌ధానం! ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ బ‌లాలు బ‌ల‌హీన‌త‌ల‌పైనే ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. రానున్న 2019లోనూ ఏపీలో త‌నే అధికారంలోకి రావాల‌ని ప‌క్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న చంద్ర‌బాబు.. దానికి త‌గిన విధంగా ఇప్ప‌టి నుంచే ప‌క్కా స్కెచ్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత పాలిటిక్స్‌లో జోరుగా ఉన్న వైకాపా, జ‌న‌సేన పార్టీల బ‌లాబ‌ల‌పై క‌న్నేసి.. దానికి త‌గిన విధంగా బాబు త‌న మాస్ట‌ర్ ప్లాన్‌ను అమ‌లు చేస్తున్నారు.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కు కాపు సామాజిక వ‌ర్గం వెన్నంటే ఉంటుంది. దీనిలో ఎలాంటి అనుమాన‌మూ ఉండ‌దు. ఇక‌, వైకాపా అధినేత జ‌గ‌న్‌కి కూడా రెడ్డి సామాజిక వ‌ర్గం మ‌ద్ద‌తు పలుకుతుంది. ఈ క్ర‌మంలో ఈ రెండు సామాజిక వ‌ర్గాలూ త‌న‌కు దూరం కాకుండా చూసుకుంటేనే చంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల ప్లాన్ స‌క్సెస్ అయి.. త‌న‌కు సీఎం సీటు ద‌క్కుతుంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న స్టైల్‌లో పొలిటిక‌ల్ చ‌క్రం తిప్పుతున్నారు.  పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ, కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలోజరిగే ఎమ్మెల్సీ ఎన్నిక.. ఈ మూడు సీట్లకూ తెలుగుదేశం వైపు నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులే రంగంలోకి దింపుతున్నారు.

ఫ‌లితంగా కాపు సామాజిక వ‌ర్గం ప‌వ‌న్ వెంట న‌డిచినా.. క‌మ్మ వ‌ర్గం, బీసీ వ‌ర్గం త‌న‌తో ఉండేలా ప్లాన్ చేసుకున్న చంద్ర‌బాబు.. వైకాపాకు బ‌లంగా ఉంటుంద‌ని భావిస్తున్న రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొంటున్నారు. ఈ క్ర‌మంలో అనంతపురం-కడప- కర్నూలు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి కేజే రెడ్డిని,  చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి పట్టాభిరెడ్డిని, కడప జిల్లా స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో ఎం. రవీంద్రనాథ్ రెడ్డి ని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. ఫ‌లితంగా రెడ్డి సామాజిక వ‌ర్గం త‌న‌నుంచి దూరంగా పోకుండా ఆయ‌న జాగ్ర‌త్త‌లు తీసుకున్నారన్న‌మాట‌. సో.. బాబు ఫ్యూచ‌ర్ ప్లాన్ అదిరింది క‌దూ!!