యూపీ ఎన్నిక‌ల‌పై స‌ర్వే సిత్రాలు సూడ‌రో!

వ‌చ్చే ఏడాది ప్రారంభంలో జ‌ర‌గ‌నున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(యూపీ) అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి వివిధ సంస్థ‌లు చేస్తున్న స‌ర్వేలు, వెల్ల‌డిస్తున్న ఫ‌లితాలు హాట్‌హాట్‌గా ఉంటున్నాయి. రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వేడెక్కిస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రాల్లో ఒక‌టి, నియోజ‌క‌వ‌ర్గాల ప‌రంగా అదిపెద్ద‌ది అయిన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లంటే… ఆ ఒక్క రాష్ట్ర‌మే కాదు.. దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటుంది. ఇక్క‌డ ఎంపీ స్థానాలు కూడా ఎక్క‌వే. కాబ‌ట్టి ఇక్క‌డ అధికారంలోకి వ‌చ్చే పార్టీకి త‌దుప‌రి జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎక్కువ మంది ఎంపీల‌ను గెలిపించుకునేందుకు ఛాన్స్ ఉంటుంద‌ని, దీంతో కేంద్రంలో ఏర్ప‌డే ప్ర‌భుత్వంపై ప‌ట్టు సాధించొచ్చ‌ని భావిస్తాయి. దీంతో రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు అన్ని ప‌క్షాలూ హోరాహోరీ త‌ల‌ప‌డుతాయి.

తాజాగా కూడా యూపీలో ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంద‌ని స‌ర్వేలు చాటుతున్నాయి. ప్ర‌ధానంగా జాతీయ పార్టీ బీజేపీ, ప్ర‌ధాన విప‌క్షం మాయావ‌తి నేతృత్వంలోని బీఎస్పీ గ‌ట్టి పోటాపోటీగా నిలుస్తున్నాయ‌ని చెబుతున్నాయి. మ‌రో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ప్ర‌చారం ప్రారంభించినా ఆశించిన ఫ‌లితాలు రాబ‌ట్ట‌డం క‌లేన‌ని అంటున్నాయి. ఇక‌, ప్ర‌స్తుత అధికార పార్టీ ఎస్పీ సీఎం అభ్య‌ర్థిగా అఖిలేష్ హ‌వా కొన‌సాగుతుంద‌ని, అయితే, ద‌ళిత నేత మాయావ‌తిని సీఎం గా చూడాల‌నుకునేవారి సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని స‌ర్వేలు పేర్కొంటున్నాయి. ఇప్ప‌టికే పలు సంస్థ‌లు స‌ర్వేలు చేశాయి.

వాటి వివ‌రాలు. చూద్దాం.. బీజేపీ 170-183 స్థానాలను గెలుచుకు ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఒక సంస్థ తెలిపింది. ఇండియా టుడే – యాక్సిస్ నిర్వహించిన మరో సర్వేలో రాష్ట్రంలో హంగ్ ఏర్ప‌డుతుంద‌ని తేలింది. కాగా, 115-124 సీట్లతో ప్ర‌తిప‌క్ష బీఎస్పీ రెండోస్థానాన్ని కైవ‌సం చేసుకుంటుంద‌ని, సమాజ్‌వాదీ పార్టీకి 94-103 స్థానాలు వస్తాయని మ‌రో స‌ర్వే చెబుతోంది. ఇక‌, సోనియా నేతృత్వంలోని కంగ్రెస్‌కి కేవ‌లం 8 నుంచి 12 అసెంబ్లీ స్థానాలే ద‌క్కుతాయ‌ని అంటున్నారు.

సీఎం అభ్య‌ర్థుల విష‌యంల ప్ర‌జ‌ల మ‌నోభీష్టం ఇలా ఉంది..

ఎస్పీ   అఖిలేష్ యాద‌వ్‌(ప్ర‌స్తుత సీఎం) 27% మంది మ‌ళ్లీ సీఎం కావాల‌ని కోరుతున్నారు.

బీఎస్పీ మాయావ‌తి 31% మంది సీఎం కావాల‌ని కోరుతున్నారు.

బీజేపీ  రాజ్‌నాథ్ సింగ్ 18% మంది సీఎం కావాల‌ని కోరుతున్నారు.

బీజేపీ యోగి ఆదిత్యనాథ్ 14% మంది సీఎం కావాల‌ని కోరుతున్నారు.

కాంగ్రెస్ షీలా దీక్షిత్ 1% మంది సీఎం కావాల‌ని కోరుతున్నారు.

ఎస్పీ ములాయం సింగ్ యాద‌వ్  1% మంది సీఎం కావాల‌ని కోరుతున్నారు.