చంద్ర‌బాబులో నాటి జోష్ నేడు ఏమైంది…

వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో… ప‌రిపాల‌నాధ‌క్షుడిగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు సామ‌ర్థ్యం ఏంటో ఆయ‌న ట్రాక్ రికార్డ్ చెప్ప‌క‌నే చెవుతుంద‌నేది టీడీపీ వ‌ర్గాలు త‌ర‌చూ చెప్పే మాట‌. పైకి ఏం చెప్పినా ఇందులో వాస్త‌వ‌ముంద‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కూడా ఒప్పుకునే విష‌య‌మే. అయితే ఈ వాద‌న చంద్ర‌బాబు గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పటి కాలానికి వ‌ర్తిస్తుంది కాని…  ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆ స్థాయిలో ప‌ని చేయ‌లేక పోతోంద‌ని ఇపుడు ఏ పార్టీకి సంబంధం లేని త‌ట‌స్థుల్లో ఎక్కువ‌గా వినిపిస్తున్న అభిప్రాయం.

ఇక్క‌డ ప్ర‌ధానంగా గ‌మ‌నించాల్సిందేమిటంటే  ఇప్పుడు కూడా ప్ర‌జ‌ల్లో అధిక‌శాతం… ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప‌నితీరుకు మంచి మార్కులే వేస్తున్నారు. అయితే అధిక శాతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, చాలామంది  మంత్రుల ప‌ట్ల మాత్రం ప్ర‌జ‌ల్లో అసంతృప్తి అంతకంత‌కూ పెరుగుతోంది. అవినీతి కూడా ఎక్కువ‌గానే ఉంద‌ని విమ‌ర్శ‌లు పెరుగుతున్నాయి. త‌క్ష‌ణ‌మే ఇలాంటి పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకోపోతే చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి భ‌విష్య‌త్తులో ఇది ప్ర‌మాద‌ఘంటిక‌లు మోగించే ప‌రిణామ‌మేన‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

ఇంత‌కీ చంద్రబాబు ప్ర‌భుత్వానికి ఎందుకు.. రావ‌ల‌సినంత పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డం లేదు. లోప‌మొక్క‌డుంది..? ఒక‌ర‌కంగా చంద్ర‌బాబుకు కూడా ఇది అర్థంకాని ప్ర‌శ్న‌గానే మిగిలిపోతుండ‌టంతో ఆయ‌న‌ ఈ అంశంపై గ‌ట్టిగానే దృష్టి పెట్టినట్టు స‌మాచారం. ఇటీవ‌ల పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరుపై సీక్రెట్ స‌ర్వే చేయించి నివేదిక‌లు తెప్పించి పార్టీ నేత‌ల‌కు మొద‌టి హెచ్చ‌రికగా వాటిని చంద్ర‌బాబు అంద‌జేశారు. వీటిలో త‌మ గుట్టుమ‌ట్ల‌న్నీ స‌వివ‌రంగా ఉండ‌టంతో చాలామంది నేత‌ల‌కు క‌ళ్లు తిరిగినంత ప‌నైంద‌ట‌. 65 ఏళ్ల వ‌య‌సులోనూ రోజుకు 18 గంట‌ల‌కు పైగా ప‌ని చేస్తూ తాను రాష్ట్రాభివృద్ధి కోసం శ్ర‌మిస్తుంటే కొంద‌రు నేత‌లు పార్టీ ప్ర‌యోజ‌నాల‌ను గాలికొదిలి, సొంత లాభాల‌కు అర్రుల చాస్తున్నార‌ని వెంట‌నే వారు త‌మ తీరు మార్చుకోక‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడ‌నని చంద్ర‌బాబు వారికి సుతిమెత్త‌గానే ఐనా  గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చారట‌.

నిజానికి తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన స‌మ‌యంలో చంద్ర‌బాబు టీమ్‌లో అశోక్‌గ‌జ‌ప‌తిరాజు, దేవేంద‌ర్‌గౌడ్‌, మాధ‌వ‌రెడ్డి, కోట‌గిరి విద్యాధ‌ర‌రావు, కోడెల శివ‌ప్ర‌సాద‌రావు వంటి స‌మ‌ర్థులైన నాయ‌కులు ఉండేవారు. వారంతా చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి మంచి పేరు తేవ‌డానికి య‌థాశ‌క్తి కృషి చేశేవారు కూడా.  ప్ర‌స్తుతం టీడీపీ క్యాబినెట్ లో ఆ స్థాయి కేప‌బిలిటీ ఉన్న‌నాయ‌కులు చాలా త‌క్కువ‌మంది. దీంతో చంద్ర‌బాబు వ‌న్ మ్యాన్‌షో మీద‌నే ప్ర‌భుత్వం ఆధార‌ప‌డుతోంద‌న్న‌మాట‌. అలాగే గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌జాప్ర‌తినిధుల‌తోనూ, అధికారుల‌తోనూ ప‌ని చేయించుకోవ‌డంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించేవారు.

ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంగా వ్య‌వ‌హ‌రించాక చంద్ర‌బాబు ఆ స్థాయిలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిం చ‌లేక‌పోతున్నార‌ని చెప్పాలి. ఈ అంశాన్ని చంద్ర‌బాబు బ‌ల‌హీన‌త‌గా తీసుకుంటున్న కొంద‌రు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ చిత్తం వ‌చ్చిన తీరులో వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతోనే ప‌రిస్థితి ఇలా త‌యారైంద‌న్న‌ నిర్ణ‌యానికి చంద్ర‌బాబు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో చంద్ర‌బాబు ముందు సీఎం అయిన‌ప్పుడు ఆయ‌న‌లో ఉన్న జోష్/  స్పీడ్‌ ఇప్పుడు లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఏదేమైనా తాజా స‌ర్వేల హెచ్చ‌రిక‌ల‌తో తోకాడించే వారి తోక‌లు క‌త్తిరించ‌డానికి ఏమాత్రం వెనుకాడ‌న‌ని చంద్ర‌బాబు తేల్చిచెప్ప‌డంతో మ‌ళ్లీ పాత చంద్ర‌బాబును మ‌రోసారి  చూడ‌బోతున్నామ‌నే అనిపిస్తోంది.