హెరిటేజ్ సేల్ వెన‌క అస‌లు సీక్రెట్ ఇదే..!

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ రిటైల్ విభాగాన్ని ఆయ‌న అమ్మకానికి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. భారీ లాభాల్లో ఉన్న హెరిటేజ్ గ్రూప్‌ను సొంతం చేసుకునేందుకు ప‌లు కార్పొరేట్ సంస్థ‌లు పోటీ ప‌డినా చివ‌ర‌కు ఫ్యూచ‌ర్ గ్రూప్ సంస్థ హెరిటేజ్‌ను ద‌క్కించుకునేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. హెరిటేజ్ సేల్ విష‌యంపై ప్ర‌స్తుతం హెరిటేజ్ సంస్థ‌కు, ఫ్యూచ‌ర్ గ్రూప్ ప్ర‌తినిధుల‌కు చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు కూడా స‌మాచారం.

చంద్ర‌బాబు 1992లో హెరిటేజ్ గ్రూప్‌ను ప్రారంభించారు. హెరిటేజ్ సంస్థ డెయిరీ, రిటైల్‌, అగ్రి, బేక‌రీ, ప‌శువుల పోష‌ణ ఇలా త‌దిత‌ర విబాగాల్లో వ్యాపారాలు చేస్తోంది. ఈ సంస్థ‌కు హైద‌రాబాద్‌లో 60, బెంగ‌ళూరులో 16, చెన్నైలో 34 స్టోర్లు ఉన్నాయి. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం విష‌యానికి వ‌స్తే ఈ సంస్థ రిటైల్ వ్యాపారం 18 శాతం వృద్ధి చెంది టోట‌ల్ ట‌ర్నోవ‌ర్ రూ.583 కోట్ల‌కు చేరుకుంది. ఇక హెరిటేజ్ రిటైల్ విభాగాన్ని అమ్మనున్నార‌ని వార్త‌లు రావ‌డంతో బీఎస్ఈలో హెరిటేజ్ ఈక్విటీ విలువ ఏకంగా 10.20 శాతం పెరిగింది.

అమ్మ‌కం వెన‌క అస‌లు రీజ‌న్ ఇదే….
ఇదిలా ఉంటే హెరిటేజ్ ఫుడ్స్ విభాగంలో రిటైల్ విభాగం లాభాల వాటానే 25 శాతం వ‌ర‌కు ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ స్థాయిలో లాభాలు వ‌చ్చే రిటైల్ విభాగాన్ని చంద్ర‌బాబు స‌డెన్‌గా ఎందుకు అమ్మ‌కానికి పెట్టార‌న్న అంశంపై ఆస‌క్తిక‌ర స‌మాధానాలు వినిపిస్తున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ నాణ్య‌తా ప్ర‌మాణాల విష‌యంలో రాజీ ప‌డ‌కపోయినా రాజ‌కీయంగా ఏపీ, తెలంగాణ‌లో ఈ సంస్థ‌పై ప‌లు విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

చంద్ర‌బాబును టార్గెట్ చేసుకునే వారు ఆయ‌న వ్యాపారాల‌తో పాటు ముఖ్యంగా హెరిటేజ్ ఫుడ్స్‌పై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్న బాధ చంద్ర‌బాబులో ఉంద‌ట‌. ఈ విమ‌ర్శ‌లు ఈ సంస్థ ఉత్ప‌త్తులు వాడుతున్న వారిపై కూడా ప‌డితే అది సంస్థ వ్యాపారానికే ఇబ్బందిగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక‌ నిర్వ‌హ‌ణా ప‌రంగా కూడా ఈ విభాగం నిర్వ‌హ‌ణ క‌ష్టంగా ఉండ‌డంతో దీన్ని అమ్మేయాల‌ని బాబు డిసైడ్ అయిన‌ట్టు టాక్‌. ఈ డీల్ ఓకే అయితే బాబు అక్కౌంట్లో భారీ లాభాలే ప‌డ‌నున్నాయ‌ని తెలుస్తోంది.