తెలంగాణ లో ఎమర్జెన్సీ ప్రకటించిన మంత్రి

తెలంగాణ నీటిపారుద‌ల శాఖలో స‌డెన్‌గా ఎమ‌ర్జెన్సీ విధించారు. కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో ఫైర్ బ్రాండ్ మినిస్ట‌ర్‌గా పేరొందిన మంత్రి హ‌రీష్ రావు త‌న శాఖ‌లో ఉన్న‌ట్టుండి ఎమ‌ర్జెన్సీ విధించారు. ముఖ్యంగా ఈ శాఖ‌లోని ఇంజనీరింగ్ అధికారుల‌కు ఆయ‌న సెల‌వులు ర‌ద్దు చేశారు. అంద‌రూ ఆఫీసుల‌కు త‌క్ష‌ణ‌మే రావాల‌ని హుకుం జారీ చేశారు. అవ‌స‌ర‌మైతే.. 24 గంట‌లూ విధులు నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. అన్ని సాంకేతిక సాధ‌నాల‌నూ వినియోగించుకోవాల‌ని కూడా పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న హ‌రీష్‌రావు ఒక్క‌సారిగా ఇలా ఆదేశాలు జారీ చేయ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. గ‌డిచిన 24 గంట‌లుగా తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల‌ను వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి.

దీంతో వాగులు వంక‌లు పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. ఫ‌లితంగా చెరువులు క‌ట్ట‌లు తెంచుకునే ప్ర‌మాదం ఏర్ప‌డింది. దీనిని గ‌మ‌నంలోకి తీసుకున్న మంత్రి హ‌రీష్‌రావు.. ఢిల్లీ నుంచే పాల‌న సాగిస్తున్నారు. వాట్స‌ప్ స‌హా అన్ని సోష‌ల్ నెట‌వ‌ర్క్‌ల‌ను ఆయ‌న పూర్తిగా వాడుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న వాట్స‌ప్‌లోనే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఢిల్లీ నుంచే ఆయ‌న‌ వర్షాలు, చెరువుల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. వాట్సాప్ ద్వారా మేజర్, మీడియం, మైనర్ విభాగాల సీఈలకు పలు సూచనలు చేశారు.నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినందున చెరువులు తెగిపోయే ప్రమాదం ఉందని, ఈ దృష్ట్యా ఇంజనీర్లంతా వారి హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండి ప్రతి గంటకు వర్షపాతం నమోదు చేయాలని సూచించారు.

చెరువులు, ఇతర జలాశయాలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవ‌స‌ర‌మైతే తెగిపోయిన చెరువు క‌ట్ట‌ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేసేందుకు సిమెంటు క‌ట్ట‌ల‌ను సిద్ధం చేసుకోవాల‌ని, ఇసుక నింపిని సంచుల‌ను సిద్దం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించ‌డం గ‌మ‌నార్హం అంతేకాదు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఉపేక్షించబోమని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.దీంతో తెలంగాణ అధికారులు ఉరుకులు ప‌రుగులు పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. తెలంగాణ మంత్రుల్లో హ‌రీష్‌రావు డిఫ‌రెంట్ అని మ‌రోసారి నిరూపించారు. గ‌తంలోనూ ఆయ‌న త‌న శాఖ విష‌యంలో నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌సంశ‌లు పొందిన సంగ‌తి తెలిసిందే.