చిన్న సినిమా కాదది, చాలా పెద్దది.

హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ తెరంగేట్రం చేస్తున్న సినిమా ‘నిర్మలా కాన్వెంట్‌’ ముందుగా చిన్న సినిమా అనే అందరూ అనుకున్నారు. నాగార్జున అతిథి పాత్రలో కనిపిస్తాడని భావించారు. అయితే సినిమాకి మూల స్తంభం నాగార్జునేనని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తూ సినిమాలో నటిస్తోన్న నాగార్జున, సినిమా పబ్లిసిటీ బాధ్యతల్ని పూర్తిగా తన భుజాన వేసుకుంటున్నారు.

 ఓ పెద్ద సినిమాకి, అది కూడా తాను హీరోగా నటించే ప్రతిష్టాత్మక చిత్రానికి నాగార్జున ఎలాగైతే ప్రమోషన్‌ చేస్తున్నారో అలాగే ఈ సినిమాకీ ప్రమోషన్‌ ఇస్తున్నారు. ఇది రోషన్‌ అదృష్టంగా చెప్పాలి. రోషన్‌ తొలి సినిమాతోనే ఇంత క్రేజ్‌ ఈ సినిమాకి రావడంతో శ్రీకాంత్‌ పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు. ఇదొక క్యూట్‌ లవ్‌ స్టోరీ. సరదా సరదాగా సాగుతూనే, భావోద్వేగాలతో సినిమా కొత్త టర్న్‌ తీసుకుంటుందట.

తొలి చిత్రమే అయినా రోషన్‌ చాలా బాగా చేశాడని నాగ్‌ ప్రశంసిస్తున్నాడు. అంతకన్నా గొప్ప ప్రశంస రోషన్‌కి ఇంకేముంటుంది? రోషన్‌ ఎంత హ్యాండ్సమ్‌ లుక్‌తో ఉన్నాడో, హీరోయిన్‌ శ్రియా శర్మ కూడా అంతే క్యూట్‌గా, బబ్లీగా, గ్లామరస్‌గా కన్పిస్తోంది. అన్నీ కలిసి ఈ సినిమాని చిన్న సినిమాలా కాకుండా, పెద్ద సినిమాలా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చేస్తోంది.