చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరిగే ప్ర‌శ్న వేసిన గ‌వ‌ర్న‌ర్‌

వ‌ర్త‌మాన‌ రాజ‌కీయాల్లో విలువ‌ల‌గురించి మాట్లాడ‌ట‌మంటే గొంగ‌ట్లో తింటూ వెంట్రుక‌లు ఏరుకోవ‌డ‌మే. ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూ విప‌క్షాల‌ను బ‌ల‌హీనప‌ర‌చేందుకు అధికారంలో ఉన్న ఏ పార్టీ ఐనా త‌న శ‌క్తియుక్తుల‌న్నీ ధార‌పోస్తుండ‌టం ప్ర‌స్తుతం న‌డుస్తున్న చ‌రిత్ర. ఈ సంస్కృతికి బీజం వేసిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుతం అంప‌శ‌య్య మీద ఉన్నా, అధికారంలో వెలిగిన స‌మ‌యంలో ఇలాంటి విధానాల‌తోనే మ‌నుగ‌డ సాగిస్తూ వ‌చ్చింది.

ఇక ఇటీవ‌లి రాజకీయాల్లోకి వ‌స్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజ‌కీయాలు ఏవ‌గింపు క‌లిగించే స్థాయిలో కొన‌సాగాయి. సెంటిమెంటు రాజ‌కీయాల్ని స‌మ‌ర్థంగా అమ‌లు చేసి తెలంగాణ‌లో అధికార పీఠం చేజిక్కించుకున్న‌కేసీఆర్… అక్క‌డ‌ విప‌క్షాల ఉనికే లేకుండా చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు. కేసీఆర్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు తెలంగాణ‌లో అన్నిపార్టీలూ క‌కావిక‌ల‌మైనా పూర్తి స్థాయిలో పంచ్ ప‌డింది తెలుగుదేశం పార్టీకే…టీడీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న‌త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ వంటివారికి కేసీఆర్ మంత్రి ప‌ద‌వులు సైతం క‌ట్ట‌బెట్టారు. దీనిపై గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌ట్టిగానే ఫిర్యాదు చేశారు.

అయితే ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వం కూడా అదే పొలిటిక‌ల్ గేమ్ ఆడి విప‌క్ష‌ వైసీపీని దెబ్బ‌తీసింది. విప‌క్ష ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి ఆక‌ర్షించేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేసింది. వైసీపీలో గెలిచి టీడీపీ కండువా క‌ప్పుకున్న కొంద‌రు ఎమ్మెల్యేల‌కు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అవ‌కాశం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించింది.

ద‌స‌రాకు జ‌రిగే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ముగ్గురు జంపింగ్ ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌లిసిన చంద్ర‌బాబు ఆయ‌న‌తో ఈ విష‌యం ప్ర‌స్తావిస్తే.. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ మంత్రిప‌ద‌వి ఇవ్వ‌డంపై చంద్ర‌బాబు గ‌తంలో ఫిర్యాదు చేయ‌డాన్ని గుర్తుచేసి.., ఇప్పుడు మీరెలా ఇస్తార‌ని సూటిగా అడ‌గ‌డంతో చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరిగిపోయింద‌ట‌. శ‌కునం చెప్పే బ‌ల్లి కుడితిలో ప‌డ‌టం ఇదేనేమో మ‌రి..!