విశాఖకు దూరమవుతున్న విద్యాసంస్థలు

ప్రతిష్ఠాత్మకమైన వివిధ విద్యా సంస్థలను విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ అవి ఇతర జిల్లాలకు తరలిపోతున్నాయి. తాజాగా విశాఖలో ఏర్పాటు చేయాలనుకున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపిఎం) కృష్ణాజిల్లా కొండపల్లికి తరలించాలని నిర్ణయించారు. విభజన నేపథ్యంలో పలు విద్యా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందు కు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని విశాఖలో ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు.

ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు ఏర్పడిన విషయం తెలిసిందే. అందులో కొన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్(ఐఐపిఎం)ను విశాఖలో ఏర్పాటు చేయాలని ఇక్కడి ఎంపి హరిబాబు గత కొంత కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. టీ,కాఫీ, రబ్బరు, సుగంధ ద్రవ్యాల తోటలు, వ్యవసాయ అధారిత వాణిజ్యం తదితర అంశాలలో నిపుణులను తయారు చేసే ఈ విద్యా సంస్థను విశాఖలోనే ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. 2014లో ఈ విద్యా సంస్థను అనకాపల్లి వద్ద ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు స్థలం ఎంపిక, సాధ్యాసాధ్యాలపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి గత ఏడాది జవనరిలో అందచేసింది. అయితే, వివిధ కారణాల వల్ల ఈ విద్యా సంస్థ ను కృష్ణాజిల్లా కొండపల్లికి తరలించాలని నిర్ణయించింది. ఫలితంగా విశాఖలో ఏర్పాటు కావాల్సిన మరో విద్యా సంస్థ ఇతర జిల్లాలకు తరలిపోయినట్టయింది. ఈ విషయాన్ని ఎంపి హరిబాబుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఇప్పటికే విశాఖలో ఏర్పా టు కావాల్సిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టి), ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపి)లు కాకినాడకు తరలిపోవడం తెలిసిందే. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కూడా ఐఐటి హోదా ప్రకటించడంతో ఆ సంస్థ శాఖ విశాఖలో ఏర్పాటు చేసే వీలు లేకుండా పోయింది. వీటిని విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అవి ఇతర ప్రాంతాలకు తరలిపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.