యువరాజా, ఏంటి ఈ మాట తేడా!

యువరాజా రాహుల్‌గాంధీ మాట మార్చారు. మహాత్మాగాంధీని ఆర్‌ఎస్‌ఎస్‌ అంతమొందించిందని ఇదివరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్‌గాంధీ, ఇప్పుడు మాట మార్చి ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న ఓ వ్యక్తికి మహాత్మాగాంధీ హత్య కుట్రలో సంబంధం ఉందని మాత్రమే అన్నట్లు చెప్పారాయన. మహాత్మాగాంధీ హత్య కుట్రలో తమను ఇరికించేందుకు రాహుల్‌ ప్రయత్నించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ న్యాయస్థానంలో ప్రశ్నించింది. న్యాయస్థానం ఈ కేసులో ఇప్పటికే రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేయగా, రాహుల్‌ తరఫు న్యాయవాది, తమ క్లయింటు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వాదించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ సమాధానంతో సంతృప్తి చెందితే, కేసును కొట్టివేయడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని న్యాయస్థానం చెప్పింది. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ విషయంలో రాహుల్‌ని వదిలిపెట్టేది లేదంటోంది. రాహుల్‌, ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆరోపణలు చేశారనడానికి ఆధారాలున్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై వ్యక్తిగత కక్ష తనకు ఏమీ లేదని రాహుల్‌ చెబుతుండగా, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇమేజ్‌ని పాడుచేసేందుకు రాహుల్‌ ప్రయత్నిస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఏదేమైనా నాయకుడన్నవారు మాటకు కట్టుబడి ఉండాలి. కష్టమే ఎదురైనా ఆడిన మాట తప్పకూడదు. తప్పు చేశాక, దాన్ని సరిదిద్దుకోడానికీ వెనుకాడకూడదు. రాహుల్‌ కాంగ్రెసు పార్టీకి ఉపాధ్యక్షుడై ఉండీ మాటకు కట్టుబడి ఉండకపోవడం శోచనీయమే కదా.