మోహన్ లాల్ కోసం బాహుబలి బ్రేక్

దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి-2’ టీమ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. జక్కన్నతో పాటూ నటీనటులూ ఈ రిలాక్సేషన్ టైమ్ ను ‘మనమంతా’ కోసం స్పెండ్ చేయనున్నట్లు సమాచారం. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నిన్నటితరం హీరోయిన్ గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 5న మూడు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం కోసం రాజమౌళి తమ భారీ ప్రాజెక్ట్ కు విరామం ఇవ్వడం ఆసక్తిగా మారింది.

బాహుబలి షూటింగ్ తో ఎంత బిజీగా ఉన్నా.. కొత్తగా వస్తున్న సినిమాలనూ ఫాలో అవుతున్నారు రాజమౌళి. ఇటీవలే ‘పెళ్లి చూపులు’ చిత్రాన్ని చూసి.. రిఫ్రెషింగ్ సినిమా అంటూ ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు. ఆయన అభిప్రాయం.. ఈ చిన్న సినిమాకు మంచి ప్రచారాన్నే తీసుకొచ్చింది. లేటెస్ట్ పిక్చర్ ‘మనమంతా’ను రాజమౌళితో పాటు బాహుబలి బృందం కూడా ప్రీమియర్ షోల ద్వారా తిలకించనుంది. సూపర్ స్టార్ ‘మొహన్ లాల్’ నటించడంతోనే ఈ చిత్రంపై దర్శక ధీరుడు ఇంత ఆసక్తి చూపిస్తున్నారని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.