జీఎస్టీ ఎఫెక్ట్:తెలంగాణా నష్టం ఎంతో తెలుసా

అనుకున్నట్టే జీఎస్టీ బిల్లు రాజ్య సభలో ఏ అడ్డంకులు లేకుండానే పాస్ అయిపొయింది.అయితే ఇక్కడ ఈ బిల్లు ఎఫెక్ట్ వేరే రాష్ట్రాలపై ఎలా వున్నా హైదరాబాద్ అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న తెలంగాణా రాష్ట్రం మాత్రం ఈ బిల్లుతో ఏటా భారీగా నష్టపోనున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతో తెలంగాణ ఏటా రూ.5 వేల కోట్లకుపైగా నష్టపోనుంది.ఓ వైపు కేంద్రం ఐదేళ్లపాటు రాష్ట్రాలకొచ్చే నష్టాన్ని మేమె భరిస్తామని చెప్తున్నా ఆ ఐదేళ్ల కాలపరిమితి తరువాతైనా ఆ నష్టాన్ని భరించాల్సింది రాష్ట్రాలే.అందులోనా ఈ ఐదేళ్ల కాలంలోనూ కేంద్ర భరించే నష్టం తాలూకు నిధులకోసం రాష్ట్రాలు ఎదురు చూడక తప్పదు.

వ్యాట్ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణా ప్రభుత్వం రూ.32 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకుంది.ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ లెక్క దాదాపుగా 40 వేల కోట్ల పైమాటే అని చెప్తున్నారు.జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందినా సాంకేతికంగా అది అమలయ్యేది వచ్చే ఏప్రిల్ నుండి నే.అంటే వచ్చే ఏప్రిల్ నుండి తెలంగాణా లో ఇప్పటిదాకా వసూలు చేస్తున్న వ్యాట్‌కు బదులు రాష్ట్రంలో స్టేట్ జీఎస్‌టీ, సెంట్రల్ జీఎస్‌టీ మాత్రమే వసూలు చేస్తారు.దీనివల్ల తెలంగాణా రాష్ట్రం ఏటా 5 వేల కోట్లకు పైగా నష్టపోతుందని లెక్కలేస్తున్నారు.

అయితే ఇక్కడ రాష్ట్రాలు నష్టపోయే మొత్తం సామాన్యులకి లాభం చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను మినహాయిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినా ఆమేర రైతులకి నేరుగా లబ్ది చేకూరాలి.ఇదే రకంగా మిగతా వినియోగదారులకి కూడా ఇతర పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయే మొత్తం వినియోగదారులకు చెందాలి . అయితే దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిబద్దతతో చట్టాన్ని అమలు చేసి సామాన్యుడికి ఉపయోగపడేలా చేస్తాయన్నదే అసలు ప్రశ్న.