కెసియార్‌ స్పీడ్‌కి విపక్షాలు బేజార్‌!

కొత్త జిల్లాలతో తెలంగాణ వైశాల్యమేమీ పెరగదు. కానీ 10 జిల్లాల తెలంగాణ ఇకపై 27 జిల్లాల తెలంగాణగా కొత్త రూపు సంతరించుకోనుంది. సెంటిమెంట్‌ పరంగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఇదో అడ్వాంటేజ్‌. తెలంగాణ ఉద్యమంలోనే కెసియార్‌ జిల్లాల విభజన గురించి ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. సరిగ్గా సమయం చూసి, మహారాష్ట్రతో నీటి ఒప్పందాల అంశాన్ని కెసియార్‌ తెరపైకి తెచ్చారు. మ

హారాష్ట్ర నీటి ఒప్పందాల గొడవలో విపక్షాలు ఉండగానే, జిల్లా విభజన వ్యవహారాన్ని కెసియార్‌ చక్కబెట్టేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వానికి ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో అడ్వాంటేజ్‌ ఉంటుంది. విపక్షాలు కన్‌ఫ్యూజన్‌లో ఉంటే అధికార పార్టీ తన పనులు తాను చక్కగా చక్కబెట్టుకోడానికి వీలవుతుంది. జిల్లాల విభజనపై నోటిఫికేషన్‌, అఖిలపక్ష సమావేశం అన్నీ జరిగిపోయాయి.

జిల్లాల మ్యాప్‌లు కూడా వచ్చేశాయి. దసరా పండక్కి కొత్త జిల్లాలు ఉనికి లోకి వస్తాయని ఇప్పటికే ప్రకటించిన కెసియార్‌, ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలోని కొన్ని చోట్ల జిల్లాల విభజన ఉద్రిక్త పరిస్థితులకు తావిస్తున్నా, అవేవీ కెసియార్‌ వ్యూహాల ముందు నిలబడటంలేదు. విపక్షాలు కూడా గందరగోళంలోకి నెట్టివేయబడి, పూర్తిగా చేతులెత్తేశాయి.