అటు ఐసిస్ ఇటు తెరాస మధ్యలో నయీం ఖల్లాస్

నయీం  గ్యాంగ్ స్టర్.. ఎన్నో హత్యలు చేశాడు..ప్రతి వ్యవహారంలోనూ వేలుపెట్టి సెటిల్మెంట్లు …చడీచప్పుడు లేకుండా అత్యంత రహస్య ఆపరేషన్ తో తెల్లారేసరికి ఎన్ కౌంటర్ చేసి పడేశారు..చాలాకాలం పోలీసులకు ఇన్ఫార్మరుగా ఉంటూ… మావోయిస్టులను, పౌరహక్కుల నేతలనూ చంపిన నయీం ఒక్కసారిగా పోలీసులకు, ప్రభుత్వానికి ఎందుకు టార్గెట్ అయ్యాడు..?  ఒకటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో కొత్తగా సంబంధాలు పెట్టుకోవడం.. రెండు తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలను బెదిరించడం.

రెండో కారణమే బలంగా వినిపిస్తున్నా, మొదటి కారణం కూడా ప్రభుత్వం తక్షణం యాక్షన్ తీసుకోనే కారణమే.నయీం ఇప్పటికే భారీ నెట్ వర్కు ఏర్పాటు చేసుకుని ఆరితేరిపోయిన నేరగాడు. అలాంటి వ్యక్తి ఐఎస్ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకుంటే ఉగ్రవాదులను ఆపడం చాలా కష్టం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ వరకు సొంత స్థావరాలు ఉన్న నయీం కనుక ఉగ్రవాదులతో చేతులు కలిపితే ఎన్ని వేల మంది ప్రాణాలు పోతాయో చెప్పలేని పరిస్థితి. అందుకే ఆ సమాచారం తెలియగానే ఏమాత్రం లేటు చేయకుండా ఎన్ కౌంటర్ చేశారన్నది ఒక వాదన.

అయితే.. అంతకంటే బలంగా వినిపిస్తున్న విషయం ఇంకోటి ఉంది. అది.. టీఆరెస్ ప్రభుత్వానికే నయీం బెదిరింపులు చేయడం. ఈ కారణంగానే నయీం తన చావును తానే కొని తెచ్చుకున్నాడని తెలుస్తోంది.  భూదందాలు, సెటిల్ మెంట్లలో ఆరితేరిన నయీమ్ తాజాగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలపై బెదిరింపులకు దిగాడు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని బెదిరించిన నయీమ్ తన అనుమతి లేనిదే నియోజకవర్గంలో కాలు మోపరాదని ఆంక్షలు విధించాడు. ఈ తరహా వేధింపులే మరింత మంది ఎమ్మెల్యేలకు ఎదురు కాగా వారంతా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారట.  దాంతో కేసీఆర్ స్పందించి ఎమ్మెల్యేల భద్రత పెంచారు. నయీమ్ నుంచి తన ఎమ్మెల్యేలను రక్షించుకునే క్రమంలో కేసీఆర్ వారికి బుల్లెట్ ప్రూఫ్ కార్లను కూడా ఇచ్చారు.

ఆ తరువాత ఎమ్మెల్యేలు మళ్లీ కేసీఆర్ వద్దకు వచ్చి మొరపెట్టకున్నారు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని.. బుల్లెట్ ప్రూఫ్ కార్లున్నా నయీం నుంచి తమకు రక్షణ లేదని ఆందోళన చెందారట. ప్రజాజీవితంలో ఉండే ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం నయీంకు పెద్ద కష్టం కాదని గుర్తించిన కేసీఆర్ ఎమ్మెల్యేల వాదనతో ఏకీభవించి నయీమ్ వేట కోసం గ్రైహౌండ్ బలగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రంగంలోకి దిగిన ఇంటిలిజెన్సు,  గ్రేహౌండ్సు బలగాలు నయీం కదలికలపై కన్నేసి ఖతం చేసినట్లు తెలుస్తోంది.