సల్మాన్‌ఖాన్‌కి మళ్ళీ విముక్తి

అదేంటో అన్నీ సల్మాన్‌ఖాన్‌కి అలా కలిసొచ్చేస్తున్నాయి. ఎప్పుడో చేసిన పాపాలన్నీ కెరీర్‌లో సక్సెస్‌ల కారణంగా మరుగునపడిపోతున్నాయి. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ సుడి అలా తిరుగుతోంది. ఇప్పటికే హిట్‌ అండ్‌ రన్‌ కేసు నుంచి ఊరట పొందిన సల్మాన్‌ఖాన్‌ ఇంకో కేసఉలో ఊరట పొందాడు.

సల్మాన్‌ఖాన్‌ని తాజాగా నిర్దోషిగా ప్రకటించింది రాజస్థాన్‌ హైకోర్టు. 18 ఏళ్ళ క్రితం నాటి కేసు ఇది. ఆ సమయంలో కొందరు బాలీవుడ్‌ నటీ నటులతో కలిసి కృష్ణ జింకల్ని వేటాడిన సల్మాన్‌ఖాన్‌, కేసుల్లో ఇరుక్కున్నాడు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం తగిన ఆధారాల్లేవని కేసు కొట్టేసింది న్యాయస్థానం. అంతకు ముందు ఇదే కేసులో కింది కోర్టు సల్మాన్‌ఖాన్‌కి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది, సల్మాన్‌ఖాన్‌ని దోషిగా నిర్ధారించి. ఆ తీర్పుని ఇప్పుడు హైకోర్టు కొట్టివేసింది.

సల్మాన్‌ఖాన్‌కి ఇది అతి పెద్ద ఊరటగానే భావించవలసి ఉంటుంది. ఈ మధ్యనే ‘సుల్తాన్‌’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న సల్మాన్‌ఖాన్‌, కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో ఊరట పొందడం పట్ల అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారట. కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌ జైలుకి కూడా వెళ్ళి వచ్చాడు. ఏదేమైనా సల్మాన్‌ఖాన్‌ సుడి చూసి బాలీవుడ్‌లో తోటి నటీనటులే ఆశ్చర్యపోవాల్సి వస్తుందంటే ఎంతలా ఆయనకు లక్కు కలిసొస్తుందో కదా.