విద్యార్థుల జీవితాలతో చెలగాటం

ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వానికి కత్తిమీద సాము. అలాగే ప్రవేశ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకైతే మళ్ళీ పరీక్ష రాయడం అనేది కష్టసాధ్యం. విద్యార్థి లోకం పోటీ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతోంది. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్ని ఎందర్నో చూస్తున్నాం.

ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యిందని తెలంగాణ సిఐడి స్పష్టం చేయడంతో ఇంకోసారి ఎంసెట్‌ నిర్వహణ జరుగుతుందనే ప్రచారం కారణంగా విద్యార్థి లోకం ఆందోళనతో అప్రమత్తమయ్యింది. మళ్ళీ మళ్ళీ అదే చదువు చదవలేం, మా జీవితాల్ని నాశనం చేయొద్దంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ‘కొందరు చేసిన తప్పులకు మమ్మల్ని శిక్షిస్తారా?’ అని విద్యార్థులు కన్నీరుమున్నీరువతూ ప్రశ్నించడం బాధ కలిగిస్తోంది.

ఇక్కడ దురదృష్టకరమైన ఇంకో విషయం ఏమంటే, లీకేజీకి కారణమైన నిందితులకు గతంలోనూ ఇదే నేరచరిత్ర ఉంది. అలాంటి వారిపై నిఘా పెట్టకుండా, వారిని జన బాహుల్యంలోకి స్వేచ్ఛగా వదిలేయడంతో వేలాది, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఇప్పుడు రోడ్డున పడిపోయాయి. ఈ భావోద్వేగాల తరుణంలో ఒక్క విద్యార్థి ప్రాణం కోల్పోయినా అది ప్రభుత్వ హత్యే అవుతుంది.