యువరాజ్, హర్భజన్ లను కొట్టిన అక్తర్

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. భారత క్రికెటర్లపై దాడి చేశాడా..? ఆగ్రహానికి కేరాఫ్ అడ్రస్ అయిన యువీ, భజ్జీలను అక్తర్ ఎందుకు కొట్టాడు? అసలేం జరిగిందనేగా మీ డౌట్. అయితే ఈ స్టోరీ చదవండి.
దాదాపు 12ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను తాజా హర్భజన్ సింగ్ బయటపెట్టాడు. అప్పుడు జరిగిన వివాదం తాలూకు వివరాలను చెప్పాడు. 2004లో పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు హర్భజన్ తెలిపాడు. తనను, యువరాజ్ సింగ్ ను అక్తర్ చాలా సార్లు తిట్టాడని.. ఓ సారి తమను కొట్టాడని కూడా భజ్జీ వెల్లడించాడు.
మ్యాచ్ ల సందర్భంగా, ఇతర కార్యక్రమాలప్పుడు అక్తర్ ఎప్పూడు తమకు సమీపంలోనే కూర్చునే వాడని.. తాము ఏం మాట్లాడతామో తెలుసుకునేందుకు అలా చేసేవాడేమో అని అనుమానించాడు. ఓ సారి తనను హోటల్ రూమ్ కి వచ్చి కొడతానన్నాడని., తాను కూడా ఎవరు ఎవర్ని కొడతారో చూద్దాం అంటూ ఘాటుగా స్పందించానని భజ్జీ గుర్తు చేసుకున్నాడు. ముందు అన్నట్లే అదే రోజు రాత్రి తమ గదికి వచ్చి యువరాజ్ ను, తనని కొట్టాడని చెప్పాడు. అక్తర్ భారీ కాయుడు కావడంతో అతడ్ని పట్టుకోలేకపోయామన్నాడు భజ్జీ.
దీనిపై అక్తర్ కూడా స్పందించాడు. రావల్పండిలో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వివరణ ఇచ్చాడు. ఐతే ఆ వివాదాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదన్న అక్తర్., సరదాగా ఆట పట్టించేందుకే అలా చేశానన్నాడు. యువీ, భజ్జీలను ఎప్పుడూ తమ్ముళ్లలాగే చూసేవాడనని అక్తర్ చెప్పాడు.