బాబోయ్ పొకెమాన్ చంపేస్తోంది!

ప్రపంచవ్యాప్తంగా 26కు పైగా దేశాల్లో విడుదలైన ఆన్‌లైన్ రియాల్టీ గేమ్ పొకెమాన్ పలు దేశాల్లో వివాదాస్పదమైంది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ఆధారంగా ఆడే ఈ గేమ్‌లో వాస్తవ ప్రదేశంలో ఒకరు పొకెమాన్ చిత్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఆటగాళ్లు.. జీపీఎస్, గూగుల్ మ్యాప్స్ ద్వారా వెతుక్కొంటూ వెళ్లి దానిని గుర్తించాలి. ఈ గేమ్ కొందరికి ఎగ్జైటింగ్‌గా ఉన్నా.. మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఆట ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ సౌదీ అరేబియా మత పెద్దలు పొకెమాన్‌పై ఇప్పటికే ఉన్న ఫత్వాను పునరుద్ధరించారు.

ఈ ఆటపై బోస్నియా సైతం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న మందుపాతర్లపై నడిచే ప్రమాదముందని ఈ గేమ్‌ను ఆడే ఆటగాళ్లను ప్రభుత్వం హెచ్చరించింది. ఈ గేమ్ అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కుట్రలో భాగమంటూ రష్యా విరుచుకుపడింది. ప్రభుత్వ వెబ్‌సైట్ల ద్వారా ఈ యాప్‌ను ఉపయోగించడాన్ని కువైట్, ఇండోనేషియా, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా దేశాలు ఇప్పటికే నిషేధించాయి. అలాగే వ్యక్తిగత సమాచారాన్ని పణంగా పెట్టొద్దని ప్రజలకు హెచ్చరించాయి.

ఇదిలా ఉంటే.. పోకేమాన్ ఆడుతూ గ్వాటెమాలాలోని చికుములా సిటీలో జెసన్ లొపెజ్ డి లియోన్ అనే టీనేజర్ ప్రాణాలు కోల్పోయాడు. జెసన్ తన కజిన్‌తో కలిసి పోకేమాన్ చిత్రాన్ని గుర్తించేందుకు వీధిలో నడుస్తున్నాడు. అదే సమయంలో దుండగులు కొందరు వీరిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ జెసన్ చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.