నాని పంట పండింది!

తాజాగా ‘జెంటిల్‌మెన్‌’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు నాని. వరుస విజయాలతో హ్యాట్రిక్‌ కొట్టిన నాని కెరీర్‌కి ఏ మాత్రం ఢోకా లేదు ఇంకొన్నాళ్లు. వరుస సినిమాలతో రావడమే కాకుండా, వచ్చిన ప్రతీ సినిమా విజయం సాధిస్తుంది. దాంతో దర్శక నిర్మాతలకు మినిమమ్‌ గ్యారంటీ హీరో అయిపోయాడు నాని. పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా రెట్టింపు లాభం ఆర్జించొచ్చు నానితో అని డిసైడ్‌ అయిపోయారు. దాంతో నానితో సినిమాలు చేయడానికి ఒకరి తర్వాత ఒకరు ముందుకొస్తున్నారు.

‘ఉయ్యాలా జంపాలా’ వంటి చిన్న సినిమాతో హిట్‌ కొట్టిన విరించి వర్మతో నాని సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో నాని పక్కన మళయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నానితో నటించిన హీరోయిన్లకు మంచి పేరు వస్తూ ఉంటుంది. వారి కెరీర్‌ కూడా బాగానే నడుస్తుంది. ఈ సినిమాతో పరిచయం కాబోతున్న ఈ ముద్దుగుమ్మ కూడా అలాగే లక్‌ సంపాదించుకుంటుందేమో చూడాలి.

మరో పక్క నానితో మారుతి ఇంకో సినిమా చేయాలనుకుంటున్నాడట. ఈ సినిమాలో నానిని డిఫరెంట్‌ రోల్‌లో చూపించాలనుకుంటున్నాడట మారుతి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాతోనే నాని కెరీర్‌ టర్న్‌ అయ్యింది. అలాగే మారుతి కెరీర్‌ కూడా టర్న్‌ అయ్యింది. ఈ సినిమా విజయంతోనే మారుతికి పెద్ద స్టార్స్‌తో అవకాశాలు వస్తున్నాయి. అందుకే త్వరలోనే ఈ సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కించాలనుకుంటున్నారట.