చంద్రన్నా ఏంది నీ తొందర

ఆంధ్రప్రదేశ్‌ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నమాట వాస్తవం. ఆర్థిక సమస్యలతో ఆంధ్రప్రదేశ్‌ సతమతమవుతోంది. రాజధాని నిర్మించుకోవడం ఆంధ్రప్రదేశ్‌ ముందున్న తక్షణ కర్తవ్యం. కానీ అది శక్తికి మించిన పని. అయినా తప్పదు, రాజధానిని నిర్మించుకోవాల్సిందే. ఇంకో వైపున ముఖ్యమంత్రి చంద్రబాబు నేను నిద్రాహారాలు మాని కష్టపడుతున్న అని ఎంత మొత్తుకున్నా ఏ పనీ సకాలంలో పూర్తి కావడంలేదు.

ఆంధ్రప్రదేశ్‌కి అపారమైన వనరులన్నాయి, అలాగే అపాయాలు కూడా ఉన్నాయి. ప్రకృతే ఆంధ్రప్రదేశ్‌కి బలం, బలహీనత. సముద్ర తీరం ఎంత అందమైనదో, తుపాన్ల సమయంలో అంత అలజడి సృష్టిస్తుంది. ఎంతో జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తే తప్ప ఏ పనీ సకాలంలో పూర్తి కాదు. సచివాలయ నిర్మాణం కోసం అపార అనుభవం వున్న బాబు గారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని పదే పదే సెలవిచ్చారు. ఓసారి ఆయన స్వయానా నిర్మాణం పూర్తి కాకుండానే తన చేతులు మీదుగా సచివాలయాన్ని ప్రారంభించారు. ఇంకోసారి ఉద్యోగులు ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికీ ఇంకా సచివాలయం పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇంకో రెండు నెలల్లో సచివాలయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. వాతావరణ పరిస్థితులతో నిర్మాణంలో జాప్యం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నారు .మరి ముందు జాగ్రత్తంటే ఏంటని అడక్కండి ప్లీజ్.

అయితే పరిస్థితిని అంచనా వేసి, తగిన సమయంలో ఉద్యోగుల్ని తరలించి, సచివాలయాన్ని ప్రారంభిస్తే బావుండేదన్న విమర్శలు వినవస్తున్నాయి. తొందరపాటు చర్యలతో సెంటిమెంట్లను దెబ్బతీశారనే అపప్రధను చంద్రబాబు ఎందుకు మూటగట్టుకోవాలి? పట్టిసీమ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేయడం, అది వివాదాల్లో పడటమూ చంద్రబాబు తొందరపాటుతనానికి ఇంకో నిదర్శనం.