కెసియార్‌ లెక్కలు కెసియార్‌కి ఉన్నాయ్‌ 

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే మాక్కూడా ఇవ్వాలి అని ఇప్పుడు నినదించడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఒకేసారి సమైక్య తెలుగు రాష్ట్రం నుంచి వేరుపడ్డంతో ఇస్తే రెండిటికీ ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో కెసియార్‌ సహా టిఆర్‌ఎస్‌ నాయకులు నినదించారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌కి రాజ్యసభలో దక్కిన హామీ కూడా నెరవేరకపోవడంతో తెలంగాణ గట్టిగా ఆ విషయం గురించి అడగడానికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు చొరవతో ప్రత్యేక హోదా అంశంలో కదలిక రావడాన్ని లోలోపల స్వాగతిస్తున్న కెసియార్‌ అవసరమైతే పార్లమెంటులో మద్దతివ్వాలని కూడా అనుకుంటున్నారని సమాచారమ్‌.

రాజ్యసభలో బిల్లు పాస్‌ అయితే, లోక్‌సభలో చర్చ సందర్భంగా టిఆర్‌ఎస్‌ ఎంపీలు తమకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా డిమాండు చేస్తారట. అయితే ఇది ప్రైవేటు మెంబర్‌ బిల్లు గనుక, పాస్‌ అయినా, దాన్ని చట్టంగా మార్చడానికి ఇంకా పెద్ద తంతు ఉంటుంది. అందుకనే ముందుగా స్పందించి, తొందరపాటు వ్యాఖ్యలు చేసి అభాసుపాలవ్వకూడదని కెసియార్‌ అనుకుంటున్నారు. ఎంతైనా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి, తెలంగాణను సాధించిన ఘనుడు కెసియార్‌. ఆయన లెక్కలు ఆయనకి ఉంటాయ్‌.