కడియం శ్రీహరికి చెక్‌ పెడ్తారా?

తెలంగాణలో ఎంసెట్‌ వివాదాస్పదమయ్యింది. నీట్‌ పరీక్ష కారణంగా ఎంసెట్‌-1, ఎంసెట్‌-2 రాయాల్సి వచ్చింది మెడిసిన్‌ అభ్యర్థులు. అయితే ఎంసెట్‌-2 లీక్‌ అయ్యిందని సిఐడి విచారణలో తేలింది. దాంతో ఎంసెట్‌-2 ఇంకోసారి నిర్వహించాల్సి వచ్చేలా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇంకోసారి ఎంసెట్‌ నిర్వహించడం వల్ల తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

69 మంది విద్యార్థులు అక్రమంగా ఎంసెట్‌-2లో ర్యాంకులు పొందారు. పేపర్‌ లీకేజీ వెనుక పెద్ద కుట్రే దాగుందని సిఐడి తేల్చింది 50 కోట్ల పైన కుంభకోణం నడిచిందని సిఐడి నిర్ధారించింది. ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేసి, వారికి లీక్‌ అయిన పేపర్‌ని ముందుగానే అందించి, వారితో చదివించి, ర్యాంకుల్ని కొల్లగొట్టారు అక్రమార్కులు. ఈ తతంగానికి నైతిక బాధ్యత వహిస్తూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.

ఇంకో వైపున మంత్రి లక్ష్మారెడ్డి ర్యాంకుల మాయపై ముందుగా చాలా సీరియస్‌గా స్పందించారు. ఆయన చొరవ కారణంగానే ఈ మాఫియా వెలుగు చూసిందనడం నిస్సందేహం. ఏంటోగానీ తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి పదవి మొదటి నుంచీ వివాదాస్పదం అవుతూ వస్తోంది. మొదటి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజయ్య అవినీతి ఆరోపణలతో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. కడియం శ్రీహరి మెడ మీద ఇప్పుడు ఎంసెట్‌ మాఫియా అనే కత్తి వేలాడుతోంది. ముఖ్యమంత్రి కెసియార్‌ ఈ విషయంలో కడియం శ్రీహరిని వెనకేసుకొస్తారో లేదో చూడాలిక.